ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు: మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు: మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ప్రతి కార్యకర్త ధ్యేయం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ తన కుటిల యత్నాల్లో భాగంగా తెలంగాణలో సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు పన్నాగం పన్నుతోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అడ్డదారుల్లో ఓట్లను గైర్హాజరు చేసేందుకు జరుగుతున్న ఈ కుట్రను అడ్డుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్ (BLA) నియామకం, పనితీరు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. ఈ రోజు నుంచే బీఎల్ఏ కార్యక్రమం మొదలుకావాలి. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం బీఎల్ ఏలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

సంక్షేమ పాలన - పెట్టుబడుల వెల్లువ..

తెలంగాణలో ప్రజాపాలన అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై సాగుతోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్రానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం సాధారణ విషయం కాదని, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. 2023 ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ కావాలని, రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవడమే మన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.

కార్యకర్తలకు తీపి కబురు..

పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. "త్వరలోనే కార్పొరేషన్ పదవుల భర్తీ ఉంటుంది. పార్టీ శ్రేణులకు ఇది తీపి కబురు. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి." అని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలు, నాయకులు తమ సమయంలో 80 శాతం పార్టీ కోసం కేటాయించాలని ఆయన కోరారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటేనే భవిష్యత్తు విజయాలు సాధ్యమవుతాయని ఆయన పునరుద్ఘాటించారు.

Next Story