‘కరీంనగర్‌లోని ఆ ఇంట్లో 40 దొంగ ఓట్లు’: మరోసారి పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

దొంగ ఓట్లపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘కరీంనగర్‌లోని ఆ ఇంట్లో 40 దొంగ ఓట్లు’: మరోసారి పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దొంగ ఓట్లపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)కి సవాల్ విసిరారు. దేవుడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో గెలవగలరా? అని అడిగారు. బండి సంజయ్ హయంలో కేంద్రం నుంచి ఏం వచ్చాయని సూటిగా ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.. మరి ఇచ్చారా? అని అన్నారు. అంబానీ, అదానీలకు ప్రభుత్వ సెక్టరాలను కట్టబెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ఏం ఒరగబెట్టిందో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లుకు మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు.

హిందూ, ముస్లిం మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ ప్రధాన ఎజెండాగా మార్చుకుందని అన్నారు. మత విద్వేషాలా కోసం క్రికెట్ టీంను సైతం బండి సంజయ్ వాడుకుంటారని సీరియస్ కామెంట్స్ చేశారు. మీడియా ముఖంగా బీసీ రిజ్వేషన్లపై వివరిస్తాం వచ్చే బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్‌లకు ఉందా? అని అన్నారు. పాదయాత్ర అనేది కాంగ్రెస్ సంస్కృతిలో ఓ భాగం.. పాదయాత్రతో ప్రజల చెంతకు వెళ్తున్నాం.. సమస్యలు తెలుసుకుంటున్నాం అని చెప్పారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలకు అనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. సన్నబియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎఎస్ ఉండదు అని హాట్ కామెంట్స్ చేశారు. కవిత పంచాయితీ ఏంటో తెలుసుకో అని కేటీఆర్‌కు సూచించారు. నాలుగు ముక్కలైన బీఆర్‌ఎస్ రాజకీయ ముఖ చిత్రంలో కనపడదని అన్నారు. దొంగ ఓట్లతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తోంది. మోడీ మూడోసారి గెలవడానికి ఓట్ల చోరీనే కారణం. కరీంనగర్ పట్టణంలో ఓ రేకుల షెడ్డు ఉన్న ఇంట్లో నలభై దొంగ ఓట్లు ఉన్నాయి. దీనిపై సమాధానం చెప్పే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? అని సవాల్ చేశారు.

Next Story