రాహుల్‌గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ కీలక భేటీ.. ఢిల్లీలో విస్తృత చర్చ

by Ramesh Naini |

రాబోయే రోజుల్లో ఓబీసీ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మహిళా బిల్లు నేపథ్యంలో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రధానంగా డిమాండ్ చేశారు.

రాహుల్‌గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ కీలక భేటీ.. ఢిల్లీలో విస్తృత చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే రోజుల్లో ఓబీసీ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మహిళా బిల్లు నేపథ్యంలో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రధానంగా డిమాండ్ చేశారు. దీనితో ఓబీసీ అంశంపైన సభలు, సమావేశాలు నిర్వహించాలన్న ఉద్దేశ్యంతో పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. దీనికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు టీపీసీసీ చీఫ్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని 10 జన్ పథ్‌లో రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాలు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ క్రమంలో అనేక అంశాలను రాహుల్ గాంధీ దృష్టికి మహేశ్ గౌడ్ తీసుకెళ్లారు. ప్రధానంగా దేశంలో చేపడుతున్న మహిళ రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా జోడించాలని మహేశ్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు, తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, పార్టీకి సంబంధించిన జిల్లా, మండల కమిటీలు, బీఎల్ఏ నియామకాలు, అనుబంధ సంఘాల కార్యవర్గ నియామకాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో రాహుల్ గాంధీకి మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. రాష్ట్రంలో పార్టీ పరంగా జరుగుతున్న ఆర్గనైజేషన్ కార్యక్రమాలను రాహుల్ గాంధీకి స్పష్టంగా వివరించినట్లుగా మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటనలో తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన జరిపి కులగణన సమగ్ర అధికారిక సమాచారాన్ని ప్రకటించినట్లుగా రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ వివరించారు. అంతకు ముందు మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు, రాజ్యసభ ఎంపీ, అనిల్ యాదవ్ కూడా రాహుల్ గాంధీ గాంధీతో సమావేశం అయ్యారు.

Next Story