మహాలక్ష్మి పథకం జోరు.. 300 కోట్ల ప్రయాణాలతో మహిళలకు రూ.10 వేల కోట్ల ఆదా!

by Ramesh Naini |   (  Updated:2026-03-31 16:44:04  IST  )

రాష్ట్రంలో ఆర్టీసీని రక్షించుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూనే మహాలక్ష్మి పథకం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

మహాలక్ష్మి పథకం జోరు.. 300 కోట్ల ప్రయాణాలతో మహిళలకు రూ.10 వేల కోట్ల ఆదా!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆర్టీసీని రక్షించుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూనే మహాలక్ష్మి పథకం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆర్టీసీ బస్సులను శాసన సభకు పిలిపించి మహాలక్ష్మి పథకం అమలు చేశామని తెలిపారు. మంగళవారం ప్రజాభవన్​లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో మహాలక్ష్మి ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీల ఆదాపై జరిగిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నెల నెల ఆ సొమ్ములు చెల్లించాలని గతంలోనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారని గుర్తు చేశారు. ప్రతి నెల ఎంత మంది ప్రయాణం చేస్తున్నారో వాటి వివరాలు ఆర్థిక శాఖకు పంపిస్తుండటంతో ఆర్టీసీ కి డబ్బులు చెల్లిస్తుందన్నారు. మహిళలు దాదాపు 300 కోట్ల సార్లు ప్రయాణించి రూ.10 వేల కోట్లు ఆదా చేసుకున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల ప్రయోజనాలు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్ లో మీరంతా ప్రయాణం చేసిన నగదు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వడ్డీలేని రుణాలు సంవత్సరానికి రూ. 20 వేల కోట్లు బ్యాంకు లింకేజీ తో లక్ష కోట్లు మహిళలకు ఇప్పించనున్నట్లు తెలిపారు.

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని ఇందిరమ్మ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. ఇప్పటికే రూ. 57 వేల కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలకు అందించామని, రాబోయే 3 సంవత్సరాల్లో లక్ష కోట్లు మహిళలకు దాటిస్తామని అవి లక్షా 50 వేల కోట్లు దాటుతుందన్నారు. మహిళలకు లక్ష కోట్లకి చెల్లించాల్సిన వడ్డీ చెల్లిస్తున్నామని తాము ఇప్పటికీ రూ. 3800 కోట్ల లో వేయి కోట్లు చెల్లించడం జరిగిందని, బడ్జెట్లో రూ. 2800 కోట్లు పెట్టామని చెప్పారు. వచ్చే 5 సంవత్సరాల్లో 10 వేల కోట్లు మహిళలకు వడ్డీ చెల్లిస్తామని, మహిళల ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని, దీనిపై ఎలాంటి కఠిన నిర్ణయాలు అయిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లలో చేర్పిస్తున్నామని వారికి వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. వారిని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి నిధులు ఇచ్చి వారిని వ్యాపారస్థులను చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని, మంత్రి సీతక్క నేతృత్వంలో అనేక కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశారని, సోలార్ పవర్ ప్లాంట్ ,పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం సమాజం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. మహిళలను కోటీశ్వరులను చేయడానికి ఎన్ని అవరోధాలు వచ్చినా సాధిస్తూ ముందుకు వెళతామన్నారు.

మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర

ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో డిసెంబర్ 9 2023 మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి పొన్నం అన్నారు. మహిళా ప్రయాణికులే కాదు సీతక్క తాను డిప్యూటీ సీఎం కలిసి మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం పక్షాన మహిళలకు అభినందనలు తెలియజేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కి సంబంధించి యాజమాన్యం తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికుల్లో 40 మంది మహిళా ప్రయాణికులు 97 డిపోలు 35 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్నాయి. ఈ మహా లక్ష్మీ పథకం విజయవంతం అవడం లో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. రాఖీ పండగ వచ్చిన కుటుంబ సభ్యులతో గడపకుండా ఆర్టీసీ డ్యూటీ చేస్తూ రికార్డు స్థాయిలో ప్రయాణికులను తరలించారు. ఇటీవల శాసనసభలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, నియోజకవర్గాల వారీగా అవసరమైన కొత్త రూట్‌లు, కొత్త బస్సులు, బస్ స్టేషన్‌ల అభివృద్ధి పై నివేదిక తీసుకున్నామన్నారు. ఇటీవల హైదరాబాద్ లో 340 కొత్త రూట్ లలో కొత్తగా బస్సులు నడపడం ప్రారంభించామని, రాష్ట్రంలో ప్రతి మూలాల్లో ఆర్టీసీ బస్సులు నడిపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. సీసీఎస్, పీఎఫ్​బకాయిలు తీరుస్తున్నామన్నారు. యూనియన్ ల ఏర్పాటు , ఆర్టీసీ విలీనం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మిగిలిన ఏ సమస్య ఉన్న ఆర్టీసీ మీ సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చింది 2018లో మేము తెచ్చింది కాదు.. కొంత మంది యూనియన్‌ల పేరుతో కావాలని రెచ్చగొడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ లైఫ్ లైన్.. రైల్వే కనెక్టివిటీ తక్కువ.. ఇక్కడ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తుంటారని మంత్రి తెలిపారు.

48 గంటలో మహాలక్ష్మి పథకం ప్రారంభించాం

రాష్ట్రంలో డిసెంబర్​9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రకటించిన రోజు మహా లక్ష్మి పథకం అమలులోకి వచ్చిందని మంత్రి సీతక్క అన్నారు. రేవంత్​రెడ్డి అధికారం చేపట్టిన 48 గంటల్లో మహా లక్ష్మీ ద్వారా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి రూ. 10 వేల కోట్లు ఆదా చేసుకున్నారు. రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్న ఆర్టీసీ లో ఉచితంగా బస్సు ప్రయాణం చేసి వెళ్లవచ్చన్నారు. దీనిని కొంతమంది రాజకీయంగా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఎందుకు అని తప్పుడు ప్రచారాలు చేశారు. ఉచిత ప్రయాణం వ్యతిరేకిస్తున్న వారిపై మహిళలు తిరబడాలని సూచించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ 57 వేల కోట్లు మహిళా సంఘాలకు రుణాలు అందించడం జరిగింది. 4 లక్షల 78 వేల మంది మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. మహిళలకు తాము ఇచ్చిన హామీ ఒకటే మిగిలిందని రాబోయే రోజుల్లో అమలు చేస్తామన్నారు. మహిళల ఔన్నత్యాన్ని ,గౌరవాన్ని పెంచుతామని, గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం తో ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ లు ,పెట్రోల్ బంకులు,మిల్లులు ఇలా ఎన్నో వ్యాపారాలు పెట్టించి మహిళలు ఆర్థిక వృద్ధి చెందాల వారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. మాది మాయమాటలు చెప్పి.మోసం చేసే ప్రభుత్వం కాదని సీతక్క అన్నారు.

Next Story