దద్దరిల్లిన విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా

by Ajay Maddhiboyina |

ఉద్యోగ సంఘాలు, విద్యుత్ ఉద్యోగుల ఐక్యవేదికతో కనీసం సంప్రదించకుండా టీజీఎస్‌పీడీసీఎల్‌ యాజమాన్యం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తు విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు ఏకమై ఐక్య జేఏసీగా ఏర్పడి చేపట్టిన మహాధర్నా కార్యక్రమం విజయవంతమైంది.

దద్దరిల్లిన విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ సంఘాలు, విద్యుత్ ఉద్యోగుల ఐక్యవేదికతో కనీసం సంప్రదించకుండా టీజీఎస్‌పీడీసీఎల్‌ యాజమాన్యం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తు విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు ఏకమై ఐక్య జేఏసీగా ఏర్పడి చేపట్టిన మహాధర్నా కార్యక్రమం విజయవంతమైంది. విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం టీజీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో పని చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు, అధికారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి... టీజీఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టారు. ఉద్యోగుల హక్కుల విషయంలో యాజమాన్యం అవలంభిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో మింట్‌ కాంపౌండ్‌ దద్దరిల్లింది. యాజమాన్యం తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలను విరమించుకోవాలని లేని పక్షంలో మహాధర్నాతో ఆగిపోమని నాయకులు యాజమాన్యానికి హెచ్చరించారు. ధర్నా విరమించకుండా చర్చలను చేపట్టే ప్రసక్తే లేదని యాజమాన్యం మొండివైఖరిపై విద్యుత్ ఉద్యోగాలు మహాధర్నా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత కీలకమైన సమస్యలైన చర్చల ద్వార పరిష్కరించుకోకుండా ఉద్యోగులతో వైరం పెంచుకుంటు నియంతృత్వ ధోరణి అవలంభించడం మంచి పద్దతి కాదని జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తమ సమస్యలపై యాజమాన్యం నుండి సరైనా హామీ రాకపోవడంతో బుధవారం నుండి టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించామని జేఏసీ కన్వీనర్లు రత్నాకర్ రావు, శివాజీ తెలిపారు. గురువారం నుండి కార్పొరేట్ ఆఫీస్ తో పాటు జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని అలాగే విద్యుత్ ఉద్యోగులు యాజమాన్యం యొక్క మొండి వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలుపాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక పిలుపు ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న బదిలీ ప్రక్రియ నిలిపివేసి, ప్రతీసారి నిర్వహిస్తున్న విధానంలో జూన్ లేదా జూలై లో బదిలీ ప్రక్రియ చేపట్టాలని, ప్రస్తుతం తప్పనిసరి బదిలీకి ఉన్న కనీస సర్వీస్ 2 ఏళ్ల నిబంధన స్థానలో మూడేళ్లకు పొడిగించాలని, బదిలీ నిబంధనలు తప్పనిసరిగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే జారీ చేయాలంటూ ఐక్య జేఏసీ తమ డిమాండ్లను వెల్లడించింది. మహాధర్నాలో తెలంగాణ పవర్ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ సాయిబాబు, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జాన్సన్, కన్వీనర్లు రత్నాకర్రావు, శివాజీ, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శ్రీధర్, బీసి రెడ్డి, పి అంజయ్య, శ్యామ్ మనోహర్, వెంకన్న గౌడ్, సుధాకర్ రెడ్డి, మేడి రమేష్, శెట్టి, నాసర్ షరీఫ్, మాతంగి శ్రీనివాస్, గోవర్ధన్, నాగరాజు, కరుణాకర్ రెడ్డి, సదానందం, నెహ్రూ నాయక్ , నారాయణ నాయక్, వెంకటేశ్వర్లు, కుమారస్వామి, అక్బర్, భాను ప్రకాష్, కరెంట్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story