రైతుల సహకారంతోనే ఎన్‌కేఎల్‌ఐఎస్‌ పనులు శరవేగం

by Ratna Kumari |

ఊట్కూర్ మండల పరిధిలోని బాపూర్ శివారులో కొనసాగుతున్న మక్తల్- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్‌) పనులు రైతుల సహకారంతోనే శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

రైతుల సహకారంతోనే ఎన్‌కేఎల్‌ఐఎస్‌ పనులు శరవేగం
X

దిశ, ఊట్కూర్ : ఊట్కూర్ మండల పరిధిలోని బాపూర్ శివారులో కొనసాగుతున్న మక్తల్- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్‌) పనులు రైతుల సహకారంతోనే శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి అధికారులతో కలిసి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సహకరించడం వల్లే పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. రైతులకు మార్కెట్ విలువ కంటే ఆరు రెట్లు అధిక పరిహారం అందించి, ఇప్పటికే 98.5 శాతం భూసేకరణ పూర్తి చేసినట్టు వెల్లడించారు.

గతంలో ఈ ప్రాంతం కరువు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనేదని, సాగునీటి వసతులు లేక రైతులు తీవ్ర కష్టాలు పడేవారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రాజెక్టు పూర్తయి, ఊట్కూర్ మండలంలోని సుమారు 38 వేల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతోనే ఎన్‌కేఎల్‌ఐఎస్‌ పనులు మరింత వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎల్. రమేష్, జిల్లా ఇరిగేషన్ అధికారి బ్రహ్మానందం, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీధర్, ఏఈఈ వెంకటేష్, అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story