రాజాపూర్ లో స్థలమిస్తారా.. రంగారెడ్డి గూడలో కట్ట మంటారా ?

by Ratna Kumari |

మండల కార్యాలయాలను కట్టడానికి రాజాపూర్ లో స్థలం ఇవ్వకపోతే వాటిని తన స్వగ్రామం రంగారెడ్డి గూడలో ఉన్న ఆలయ భూమిలో నిర్మిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.

రాజాపూర్ లో స్థలమిస్తారా.. రంగారెడ్డి గూడలో కట్ట మంటారా ?
X

దిశ, రాజాపూర్ : మండల కార్యాలయాలను కట్టడానికి రాజాపూర్ లో స్థలం ఇవ్వకపోతే వాటిని తన స్వగ్రామం రంగారెడ్డి గూడలో ఉన్న ఆలయ భూమిలో నిర్మిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రాజాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కొత్తగా మంజూరైన గ్రామెక్య మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు ఆయన శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ తాను కూడా రాజాపూర్ మండలానికి చెందిన వాడినేనని, రాజాపూర్ మండల కేంద్రంలోనే మండల స్థాయి భవనాలన్నీ ఉండాలనే కోరిక తనకు కూడా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజాపూర్ లో రాళ్లల్లో గుట్టల్లో ఇష్టానుసారంగా ప్లాటింగ్ చేసి ఉన్న స్థలాలన్నింటినీ కబ్జాలు చేసేశారని, రాజాపూర్ లో ఎమ్మార్వో ఆఫీస్ కట్టడానికి స్థలం ఉందని అబద్దాలు ప్రచారం చేశార‌ని విమర్శించారు. ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ భవనాలు రాజాపూర్ మండల కేంద్రంలోనే ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని, అయితే ఈ భవనాలను నిర్మించడానికి ఎక్కడా స్థలాలు లేకపోవడంతో తాను ఏమీ చేయలేకపోతున్నానని వాపోయారు.

తాను ఈ ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడానికి అవసరమైన జాగాలు చూపించడానికి బీఆర్ఎస్ నేతలకు వారం రోజులు గడువు ఇస్తున్నానని చెప్పారు. ఈ గడువు లోపుగా బీఆర్ఎస్ నేతలు మండల కేంద్రంలో జాగాలు చూపించకపోతే ఇక తాను తప్పనిసరైన పరిస్థితుల్లో ఈ భవనాలను రంగారెడ్డి గూడలో కడతానని హెచ్చరించారు. రంగారెడ్డి గూడ కూడా రాజాపూర్ మండలానికి చెందిన గ్రామమే అని, ఈ గ్రామంలో ఆలయానికి చెందిన 5 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తానని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేసారు. వెయ్యి, రెండు వేల గజాల్లో ఆఫీసులు కట్టినా భవిష్యత్తులో అవి సరిపోని పరిస్థితి ఉంటుందన్ని చెప్పారు. అందుకే భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా కార్యాలయాను నిర్మించడానికి 5 ఎకరాల దేవుని పొలాన్ని కేటాయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బీఆర్ఎస్ నేతల చేతకానితనం వల్లనే పరిస్థితి ఇంతవరకూ వచ్చిందన్నారు. వారం రోజుల క్రితం బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఇస్తామన్న 20 గుంటల భూమిని వారం రోజుల లోపుగా రిజిస్ట్రేషన్ చేయించకపోతే తాను ఆ భవనాలను రంగారెడ్డి గూడలోనే కట్టాల్సి వస్తుందని స్పష్టీకరించారు. ఇక నిర్ణయం బీఆర్ఎస్ నాయకులదేనని, వారం రోజుల లోపుగా ఈ విషయంలో వారు స్పష్టతను ఇవ్వాలని అనిరుధ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసులు నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు వార్డు సభ్యులు యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు యువకులు పాల్గొన్నారు.

Next Story