- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు బిడ్డ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు..?
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ సమావేశానికి వెళ్ళినా.. నేను పాలమూరు బిడ్డను.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుంటే చరిత్ర నన్ను క్షమించదు అంటాడు.

పాలమూరు బిడ్డ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు..?
-మీ మామ పేరు పెట్టి పడావు పెట్టావు
-కాళేశ్వరంపై హంగామా చేస్తూ.. ఆ ప్రాజెక్టు పేరు ఎందుకు ఎత్తవు..?
-పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు ఆడో ..మగో చెప్పుకోలేని పరిస్థితి
-మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దిశ, జడ్చర్ల : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ సమావేశానికి వెళ్ళినా.. నేను పాలమూరు బిడ్డను.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుంటే చరిత్ర నన్ను క్షమించదు అంటాడు. 22 నెలలు అవుతున్న పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా ఎందుకు పడావు పెట్టారో..!? చెప్పాలి అని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మంగళవారం జడ్చర్లలో మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఆరు గ్యారెంటీలు అమలు అయ్యి మా సమస్యలు పూర్తిగా తీరుతాయి.. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని.. ఆశించారు. అందుకే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు.. 12 స్థానాలలో మీ పార్టీ అభ్యర్థులను గెలిపించి.. అధికారాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. మరి ఈ 22 నెలల కాలంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ను పడావు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం మీ మామగారు జైపాల్ రెడ్డి చేసిన పోరాటాలు ఏమిటో..!? పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆయనకున్న సంబంధం ఏమిటో ..? ప్రజలకు తెలుసు. ప్రాజెక్టుకు మాత్రం జైపాల్ రెడ్డి పేరు పెట్టారు. మీ మామగారి పేరు పెట్టి కూడా పనులను ఆపేశారు. కేసీఆర్ హయాంలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయకుండా పడావు పెట్టి.. ఈ ప్రాంత ప్రజల నోళ్ళల్లో మన్ను కొడుతున్నారు అని కేటీఆర్ ఆరోపించారు. కేఎల్ఐ, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది అన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తే ఆ పేరు కేసీఆర్ కు వస్తుందని భావించి పనులు నిలిపివేశారని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరానికి సంబంధించి 85 పిల్లర్లలో రెండు పిల్లర్లు కూలిపోతే.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో హంగామా చేస్తున్నారు.. మరి పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును పడావు పెట్టి ఎటువంటి అనుమతులు లేకుండా నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు పనులను రూ.4000 కోట్లతో చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు విషయాలు అన్నీ గమనిస్తున్నారు.. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే పోరాటాలు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ చెప్పారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు వారు ఏ పార్టీయో.. చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అవును మేము 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాం .. అని చెప్పాడు. చర్యలు తీసుకోవడానికి స్పీకర్ కు ఇంతకన్నా మరి ఇంకేం ఆధారం కావాలి అని దుయ్యబట్టారు. గద్వాల ఎమ్మెల్యే నేను పార్టీ మారలేదు అంటున్నాడు..!? నేను ఏ పార్టీ నుండి గెలిచానో అదే పార్టీ నాది అంటాడు. మరోసారి అభివృద్ధి పార్టీ అంటాడు..? మరి అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ను నానా మాటలు అంటుంటే ఆ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకోలేదు.. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడంలేదని కేటీఆర్ ప్రశ్నించారు. సృష్టిలో ఆడ.. మగతోపాటు మరో జెండర్ కూడా ఉంటుంది. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ కోవకు చెందుతారో అర్థం చేసుకోవాలని చురకలంటించారు. సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎస్. రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, ప్రనిల్ చందర్ పాలాది రామ్మోహన్, శ్రీకాంత్, ఇంతియాజ్, రఘుపతి రెడ్డి, పర్వత రెడ్డి, మహమూద్, కృష్ణ , కొత్తూరు బాలు తదితరులు ఉన్నారు.






