- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేళ్ల నరకయాతనకు ముగింపు ఎప్పుడో..?
మండల కేంద్రంలో నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ పునరావాసం కోసం ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తడుతూనే ఉన్నారు.

దిశ, నవాబుపేట : మండల కేంద్రంలో నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ పునరావాసం కోసం ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తడుతూనే ఉన్నారు. గ్రామాభివృద్ధి పేరుతో ఇళ్లు కూల్చివేసినా ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. “ఇల్లు పోయింది… స్థలం రాలేదు” అంటూ వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 105/772ను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారని, జిల్లా స్థాయిలో తమ పునరావాసానికి సంబంధించిన ఫైలు సిద్ధంగా ఉన్నప్పటికీ అమలు మాత్రం నేటికీ జరగలేదని వారు వాపోతున్నారు. ఇళ్ల ముందు మురుగు కాలువలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతూ నరకయాతన అనుభవిస్తున్నామని వారు తెలిపారు.
తహసీల్దార్‌కు వినతి పత్రం
రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని కోరుతూ బాధితులతో పాటు మండల కేంద్రానికి చెందిన జెకె ట్రస్ట్ చైర్మన్ వి. నరసింహ చారి మంగళవారం మండల తహసీల్దార్ శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
“ముందుగా పునరావాసం.. తర్వాతే పనులు”
ఇదిలా ఉండగా.. సీసీ రోడ్డు పనులు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో, తమకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు పనులు ప్రారంభించవద్దని బాధితులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా పునరావాసం కల్పించి, ఆ తర్వాతే అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ కుటుంబాలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో అన్న ప్రశ్నకు సంబంధిత అధికారుల నుండి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది.






