సంపదను ప్రజలకు పంచుతాం - సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

by Disha Web Desk 11 |
సంపదను ప్రజలకు పంచుతాం - సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, జడ్చర్ల : దేశ సంపదను మొత్తం కార్పొరేట్ చేతుల్లో పెట్టి, వాళ్ళ ఆదేశాల మేరకే దేశాన్ని పాలిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశ సంపద, వనరులను ప్రజలకు పంచి పెట్టాలనే ఉద్దేశంతోనే, ప్రజలను చైతన్యవంతం చేయడానికి రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.

ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంగా ముగియడంతో పాదయాత్రలో తనతో పాటు నడిచిన వారిని వెంటబెట్టుకొని బస్సులో జడ్చర్ల మీదుగా తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారన్నారు. జడ్చర్ల మండల కేంద్రం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్లో టి పి సి సి ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలన ప్రజలకు అర్థమయిందని, అందుకే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అందుకు నిదర్శనమే హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అని చెప్పారు. ఇదే ప్రభంజనం ఇప్పుడు తెలంగాణ, ఛత్తీస్గడ్, రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఐదు లక్షల కోట్ల అప్పు చేసి, తొమ్మిదేళ్ల బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టి తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. 70 ఏళ్ల పాలనలో కడెం, ఎల్లంపల్లి, ఎస్ ఆర్ ఎస్ పి, దేవాదుల, నెట్టెంపాడు , బీమా, ఎం జి కే ఎల్ ఐ, నాగార్జునసాగర్, శ్రీశైలం, కోయిల్ సాగర్, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులను కడితే కూడా ఆయన ఖర్చు 69 వేల కోట్లే అన్నారు.

సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాలు భూమి, డబల్ బెడ్ రూమ్ లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి , కేజీ టు పీజీ ఉచిత విద్య, దళితున్ని సీఎం చేస్తా నని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీ నెరవేర్చిందని, ఆరోగ్యశ్రీ అందరికీ, రుణమాఫీ రైతులకు 100% పూర్తి చేసిందని, ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించిందని, పేదలకు భూములు పంచుతామని చెప్పి పంచామని, రేషన్ కార్డును కూడా అర్హులందరికి అందజేశామని చెప్పిన ప్రతి మాట, ఇచ్చిన ప్రతి హామీ కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలల్లో ఐదు హామీలు ఇప్పటికే నెరవేర్చామని, రేపు తెలంగాణలో అధికారం చేపట్టాక కూడా ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, త్వరలోనే బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ కూడా ప్రకటిస్తామని డిక్లరేషనన్లను 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు.

రైతులకు ఉచిత కరెంటు అనేది కాంగ్రెస్ పేటెంట్ అని, రేవంత్ రెడ్డి మాటలను బీఆర్ఎస్ నాయకులే వక్రీకరించారని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో 74 నుండి 78 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనిరుద్ రెడ్డి చేపడుతున్న ప్రజాహిత పాదయాత్రలో బీఆర్ఎస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ దాడిపై జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించాలని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, దాడికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి నిత్యానందం అశోక్ యాదవ్ బుక్క వెంకటేశం ఉన్నారు.

Next Story

Most Viewed