ఉమ్మడి పాలమూరులో పోటెత్తిన ఓటర్లు

by Ajay Maddhiboyina |

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత ఎన్నికలలో ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉమ్మడి పాలమూరులో పోటెత్తిన ఓటర్లు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి/జోగులాంబ గద్వాల ప్రతినిధి/నారాయణపేట ప్రతినిధి/నాగర్ కర్నూల్/వనపర్తి : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత ఎన్నికలలో ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం నాలుగు మండలాల్లో 57,476మంది మహిళలు, 56,786మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 86.77శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం ఆరు మండలాల్లో 1,81,543మంది ఓటర్లు ఉండగా 82.73శాతంతో 1,56,710మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లాలో 1,21,528 మంది ఓటర్లు ఉండగా 84.09శాతంతో 1,03,225 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం ఐదు మండలాలకు ఎన్నికలు జరగగా 1,55,544 మంది ఓటర్లకు గాను 83.04శాతంతో 1,29,165మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లాలో నాలుగు మండలాల గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. అన్ని మండలాల్లో కలిపి 66,689మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా 84.58శాతంతో 56,403మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వలస ఓటర్లపై అభ్యర్థుల ప్రత్యేక దృష్టి...

స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్కొక్కసారి ఒకే ఒక ఓటు ఫలితాలను తారుమారు చేస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించి వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిని ప్రత్యేకంగా పిలిపించుకొని ఓట్లు వేయించుకున్నారు. బయటకు కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులను, వికలాంగులను సైతం పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు వేయించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి జిల్లాలోనూ 20శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

Next Story