జడ్చర్ల లో తొలగిపోనున్న విద్యుత్ అంతరాయాలు లో ఓల్టేజీ సమస్యలు

by Ratna Kumari |

జడ్చర్ల నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా మెరుగుదల, గృహ జ్యోతి పథకం కింద పేదలకు ఉచిత విద్యుత్, వ్యవసాయ గృహావసరాలకు కొత్త కనెక్షన్లు అందించడానికి ఇప్పటి వరకూ రూ.231.50 కోట్లను ఖర్చు చేసామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.

జడ్చర్ల లో తొలగిపోనున్న విద్యుత్ అంతరాయాలు లో ఓల్టేజీ సమస్యలు
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా మెరుగుదల, గృహ జ్యోతి పథకం కింద పేదలకు ఉచిత విద్యుత్, వ్యవసాయ గృహావసరాలకు కొత్త కనెక్షన్లు అందించడానికి ఇప్పటి వరకూ రూ.231.50 కోట్లను ఖర్చు చేసామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న జడ్చర్ల- తిమ్మాజీపేట 132 కేవీ డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణాన్ని రూ.19.20 కోట్లతో ప్రస్తుతం పూర్తి చేయించామని దీంతో నియోజకవర్గంలో లో ఓల్టేజీ సమస్య పూర్తిగా తీరిపోతుందని వివరించారు. జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విద్యుత్ సమస్యలను అధిగమించడానికి అవసరమైన అదనపు ట్రాన్స్ ఫార్మ‌ర్లు, కొత్త లైన్ల ను ఏర్పాటు చేయడం జరుగుతోందని శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి చెప్పారు.

ఇప్ప‌టివ‌ర‌కు జడ్చర్ల నియోజకవర్గానికి భూత్పూర్-పాలకొండ-జడ్చర్ల-బాలానగర్ 132 కేవీ లైన్ ప్రధాన ఆధారంగా ఉండగా.. ఇది ప్రతి రోజూ ఓవర్ లోడ్ కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తేవని, లో ఓల్టేజీ సమస్య కూడా అధికంగా ఉండేదని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి తిమ్మాజీపేట 220 కేవీ సబ్ స్టేషన్- జడ్చర్ల డబుల్ సర్క్యూట్ లైన్ గత ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసినా గడచిన ఐదేళ్లుగా ఈ లైన్ పనులు పూర్తి చేయకుండా పెండింగ్ లో ఫెట్టారని చెప్పారు. ఈ విషయం గురించి తాను అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రభుత్వం స్పందించి 21 కి.మీ.ల తిమ్మాజీపేట-జడ్చర్ల-పోలేపల్లి సెజ్ వరకూ ఈ డబుల్ సర్క్యూట్ లైన్ పనులను పూర్తి చేయడంతో ప్రస్తుతం ఈ కొత్త లైన్ కూడా జడ్చర్ల నియోజకవర్గానికి అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కొత్త లైన్ తో నియోజకవర్గంలోని లో ఓల్టేజ్ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని, వేసవిలో కూడా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని వివరించారు.

జడ్చర్ల పట్టణానికి మంజూరైన 4 సబ్ స్టేషన్లలో రెండింటి పనులు జరుగుతుండగా.. మరో రెండు సబ్ స్టేషన్ల టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. జడ్చర్ల రూరల్ మండలానికి మంజూరైన మూడు సబ్ స్టేషన్ల టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మిడ్జిల్ మండలానికి మంజూరు చేసిన 4 సబ్ స్టేషన్లలో ఒకటి ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా మరో మూడు సబ్ స్టేషన్లు టెండర్ల దశలో ఉన్నాయని అనిరుధ్ రెడ్డి వివరించారు. ఇది కాకుండా 33 కేవీ, 11 కేవీ లైన్ల మెరుగుదల కోసం ప్రభుత్వం రూ.11.17 కోట్లను మంజూరు చేసిందన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జడ్చర్ల నియోజకవర్గంలో విద్యుత్ వెలుగుల కోసం ఇప్పటి వరకూ రూ.213.50 కోట్లను ఖర్చు చేయడం జరిగిందని, ఇది పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధుల కంటే చాలా ఎక్కువ అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివరించారు.

Next Story