అప్రకటిత విద్యుత్తు కోత..?

by Ratna Kumari |

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఆయా కాలనీవాసుల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్రకటిత విద్యుత్తు కోతతో సతమతమవుతున్నారు.

అప్రకటిత విద్యుత్తు కోత..?
X

దిశ, కందనూల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఆయా కాలనీవాసుల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్రకటిత విద్యుత్తు కోతతో సతమతమవుతున్నారు. జిల్లా కేంద్రంలోని రాహత్ నగర్ కాలనీ, స్నేహపూరి కాలనీ, పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు, విద్యుత్తు మరమ్మతుల కోసం సరఫరా నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయా కాలనీ ప్రజలు తెలిపారు. విద్యుత్తుకు సంబంధించిన మరమ్మతులు చేసేటప్పుడు ఎన్ని గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారో ఒక రోజు ముందే సమాచారం ఇచ్చేవారని తెలిపారు.

ఇప్పుడు విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎవరికీ చెప్పా పెట్టకుండా ఉదయం 9 గంటల నుంచి విద్యుత్తూ సరఫరా నిలిపివేశారని వాపోయారు. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఇంట్లో నీటి సమస్య ఏర్పడిందని, ఎండల కారణంగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు అవేదన చెందుతున్నారు. అడిగితె విద్యుత్ శాఖ సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వడంలేదని, అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడంలేదని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని.. ఎండాకాలంలో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story