వ్యవసాయ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు

by Ratna Kumari |

రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో తహశీల్దార్ సైదులు ఆకస్మిక తనిఖీలు మంగళవారం నిర్వహించారు.

వ్యవసాయ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు
X

దిశ,అచ్చంపేట రూరల్ : రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో తహశీల్దార్ సైదులు ఆకస్మిక తనిఖీలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు వచ్చిన రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, ధాన్యం కొనుగోలు విధి విధానాలు, కనీస మద్దతు ధర(ఎంఎస్ పి)అమలు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న ఆయన, ఎక్కడైనా మోసం జరిగితే కఠిన చర్యలు వారిపై తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్‌లో పని చేస్తున్న ట్రేడర్స్‌ను కూడా ప్రశ్నించి, ధాన్యం నాణ్యత కొలిచే విధానాలు, తూకాల వ్యవస్థపై సమగ్రంగా విచారణ జరిపారు. మార్కెట్ సెక్రటరీతో కలిసి పరిస్థితులను సమీక్షించి, ఇటీవల రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులను గమనించినట్లు తెలిపారు. ముఖ్యంగా ధాన్యం నాణ్యత కొలవడంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదనే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ధాన్యం నాణ్యతను తప్పనిసరిగా ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం.. యంత్రాల ద్వారానే కొలవాలి. చేతులతో లేదా అనధికార పద్ధతులతో నాణ్యత అంచనా వేయడం పూర్తిగా నిషేధం, తూకాలలో ఎలాంటి అవకతవకలు జరగకూడదు. కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) రైతులకు ఖచ్చితంగా అందాలి. ట్రేడర్స్ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే మార్కెట్‌లో రైతులకు అవసర మైన కనీస సౌకర్యాలు త్రాగునీరు, నీడ సదుపాయం కల్పించాలని అధికారులకు సూచించారు.

రైతుల‌కు సూచ‌న‌లు

ధాన్యాన్ని శుభ్రంగా, తేమ లేకుండా తీసుకురావాలి. నాణ్యత ప్రమాణాలు పాటించడం ద్వారా మంచి ధర పొందవచ్చు. ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. ఈ తనిఖీలతో మార్కెట్‌లో పారదర్శకత పెరిగి, రైతులకు న్యాయం జరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story