- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి రుణం తీర్చలేక ఇల్లాలు బలి..?
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే స్థాయికి చేరాయి.

దిశ, గద్వాల క్రైం : కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే స్థాయికి చేరాయి. అప్పు తీర్చే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం.. దానికి తోడు ఇంట్లో జరుగుతున్న గొడవలతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటన గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు (దౌదర్‌పల్లి)లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌదర్‌పల్లికి చెందిన ఇందు (23), రామాంజనేయులు (24) దంపతులకు ఐదేరేళ్ల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల వీరు ఓ 'హోమ్ లోన్ ఫైనాన్స్'లో రుణం తీసుకుని నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు.
ఆ లోన్ కిస్తీలు చెల్లించే విషయంలో గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తీసుకున్న అప్పును తాను ఒక్కదాన్నే కూలీ పనులకు వెళ్లి కడుతున్నానని, తన భర్తతో పాటు ఇంట్లోని అమ్మమ్మ, తాతయ్యలు ఎవరూ సహకరించడం లేదని ఇందు తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతేకాకుండా తాను కష్టపడి సంపాదించి బీరువాలో దాచుకున్న నగదును భర్త అన్న (బావ) తరచూ గొడవపడి తీసుకువెళ్తున్నాడని, దీనిపై భర్త ,అమ్మమ్మ, తాతయ్యలు కూడా అతడిని ప్రశ్నించకపోవడంతో ఆమె తీవ్ర విరక్తికి లోనైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఇందు, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది.






