మహబూబ్ నగర్ లో ఆ మూడు ప్రైవేటు స్కూళ్లకు అనుమతి లేదు : డీఈఓ ప్రవీణ్ కుమార్

by Ratna Kumari |

మహబూబ్ నగర్ పట్టణంలోని 'డిల్లీ పబ్లిక్ స్కూల్, ది మాస్టర్ మైండ్ స్కూల్, ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్' లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని జిల్లా విద్యాశాఖ అధికారి ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు.

మహబూబ్ నగర్ లో ఆ మూడు ప్రైవేటు స్కూళ్లకు అనుమతి లేదు : డీఈఓ ప్రవీణ్ కుమార్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ పట్టణంలోని 'డిల్లీ పబ్లిక్ స్కూల్, ది మాస్టర్ మైండ్ స్కూల్, ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్' లకు ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు కానీ అనుమతులు కానీ లేవని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మూడు పాఠశాలలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు నర్సరీ నుండి పదవ తరగతి వరకు ఎలాంటి అడ్మిషన్లు తీసుకోరాదని ఆయన సూచించారు. ఏదైనా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లు తీసుకునే ముందు ఆ పాఠశాలకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా లేదా అని తెలుసుకోవాలని, ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో అడ్మిషన్లు చేయరాదని డిఇఓ ప్రవీణ్ కుమార్ సూచించారు.

ఆ పాఠశాలలపై చర్యలు తీసుకుంటారా..?

పట్టణంలోని అనుమతి లేకుండా గత అనేక సంవత్సరాల నుండి నడుపుతున్న ఆ మూడు పాఠశాలలపై ఇంతకాలం చర్యలు ఎందుకు తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. డిఇఓ తెలిపిన ఆ మూడు పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలని వారు నిలదీశారు. పట్టణంలోని అనేక పాఠశాలలో ఫీజుల దోపిడీ కొనసాగిస్తున్నారని, యూనిఫాం, టై, బెల్టు, బూట్లు, పుస్తకాలు, నోట్ బుక్స్ తదితరుల పేర పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతూ వ్యాపారం చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తున్నారని వారు తీవ్రంగా ఆరోపించారు. పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని, విద్యా శాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని వారు విమర్శించారు. ప్రభుత్వ అనుమతుల సర్టిఫికెట్లను ఫ్రేం ద్వారా గోడకు వేలాడదీసేలా ఆదేశించాలని, అనుమతి నెంబర్లను స్కూల్ టైటిల్ బోర్డులో ముద్రించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story