మెగా రెడ్డి, చిన్నారెడ్డి మధ్య ఆధిపత్య పోరు.. రచ్చకెక్కిన అధికార పార్టీ రాజకీయం

by Disha Web Desk 9 |
మెగా రెడ్డి, చిన్నారెడ్డి మధ్య ఆధిపత్య పోరు.. రచ్చకెక్కిన అధికార పార్టీ రాజకీయం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదా బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. కానీ వనపర్తి నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీ కాంగ్రెస్ నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ప్రతిపక్షాలకు మించి సాగుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన మెగా రెడ్డి, టిక్కెట్టు వచ్చినట్టే వచ్చి దక్కకుండా పోయిన నాటిననుంచి ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య ఆధిపత్య పోరు పార్టీ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

తనయుడి భవిష్యత్తు కోసం తపన..

గత అసెంబ్లీ ఎన్నికలలో తనకే టికెట్టు వస్తుందని ధీమాగా ఉన్న డాక్టర్ చిన్నారెడ్డికి టికెట్ దక్కినట్టే దక్కి చివరకు మెగా రెడ్డికి దక్కింది. పలు రకాల సమీకరణలు, సర్వేల కారణంగా పార్టీ అధిష్టానం సైతం మెగా రెడ్డి వైపే మొగ్గుచూపి టికెట్టు అతనికి కేటాయించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ వల్ల అయితేనేమి, ఇతర కారణాల వల్ల అయితే నేమి టికెట్టు మెగా రెడ్డికి దక్కింది. ఒక వర్గం వ్యతిరేకంగా పనిచేసిన చివరకు మెగా రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించగలిగారు.

ఇతర పార్టీల వారిని వద్దనుకున్న ఎమ్మెల్యే..

దాదాపుగా పదేండ్ల ఇబ్బందులు పడ్డారని, తన గెలుపు కోసం కృషి చేశారని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరగాలని ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశాలే లేవని ఎమ్మెల్యే మెగా రెడ్డి పలు సందర్భాలలో పేర్కొన్నారు. కానీ ఎమ్మెల్యే మాటలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి లెక్కచేయకుండా నియోజకవర్గంలోని ఆయా మండలాల ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యేకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవడం ఎమ్మెల్యేకు రుచించలేదు. చిన్నారెడ్డి నేరుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులను హైదరాబాదుకు తీసుకెళ్లి సీఎం సమక్షంలో పార్టీలో చేర్చడంతో వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విభేదాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మెగా రెడ్డి, డాక్టర్ చిన్నారెడ్డి వర్గీయులుగా విడిపోయారు.

రగిలిన విభేదాల మంటలు..

గోపాల్‌పేట మండలానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడానికి సమయతమవుతుంటే.. ఆ పార్టీ మండల అధ్యక్షుడు, మరి కొంతమంది ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని తమకు సంబంధం లేకుండా.. తమని పది సంవత్సరాలుగా ఇబ్బందిగా పెట్టినవారిని ఎలా పార్టీలో చేర్చుకుంటారు అంటూ ప్రశ్నించడమే కాదు.. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్, డిజిల్ ను ఒంటిపై పోసుకుని తమకు చెప్పు అంటించాలని గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం వల్ల అదుపు చేయగలిగారు. పొరపాటున నిప్పు అంటి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. చొరవ చూపకుంటే ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చొరవ చూపి ఎమ్మెల్యే మెగా రెడ్డి, అటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య సయోధ్య కుదిరించకుంటే పార్టీ క్యాడర్ రెండు గ్రూపులుగా విడిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అధిష్టానం ఈ విషయంపై దృష్టి సారించి ఇరువర్గాల మధ్య సయోధ్య కుదుర్చుకుంటే పెద్ద ఎత్తున పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది.

Next Story

Most Viewed