ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క!

by Ajay Maddhiboyina |

మున్సిపల్ పోరు అసలు ఘట్టానికి చేరుకుంది. వారం రోజులుగా పురవీధుల్లో సాగిన మైకుల హోరు, నేతల ప్రసంగాలు, ఓటర్ల కాళ్లకు చేసిన నమస్కారాల పర్వం ముగిసింది.

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క!
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: మున్సిపల్ పోరు అసలు ఘట్టానికి చేరుకుంది. వారం రోజులుగా పురవీధుల్లో సాగిన మైకుల హోరు, నేతల ప్రసంగాలు, ఓటర్ల కాళ్లకు చేసిన నమస్కారాల పర్వం ముగిసింది. అయితే, అసలైన ‘టర్నింగ్ పాయింట్’ ఇప్పుడే మొదలైంది. “ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక మరో లెక్క” అన్న చందంగా అభ్యర్థులు తమ అసలు అస్త్రాలను బయటకు తీస్తున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత నుంచి పోలింగ్ వరకు గడిచే ఆ 48 గంటలే అభ్యర్థుల జాతకాలను మార్చనున్నాయి. పగలు ప్రచారం ముగిసినా.. ఇక ‘చీకటి’ రాజకీయం ఊపందుకోనుంది. నోట్ల కట్టలు, మందు సీసాలు, మాంసం విందులతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మున్సిపాలిటీలు వేదికవుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా చివరి అంకానికి చేరుకుంది. నామినేషన్ల పర్వం నుంచి ఆదివారం వరకు అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంతో హోరెత్తిన పురవీధులు సోమవారం సాయంత్రం నుంచి నిశ్శబ్దంలోకి వెళ్లనున్నాయి. వారం రోజులుగా ఓటర్లతో పరిచయాలు, సంప్రదింపులు, హామీలు, మైకుల హోరుతో మున్సిపాలిటీలు సందడి సందడిగా కనిపించాయి. నేతల వాడివేడి ప్రసంగాలు, పరస్పర విమర్శలతో రాజకీయ వాతావరణం సెగలు పుట్టించింది. అయితే, ప్రచార పర్వం ముగిసిన తర్వాత నుంచి పోలింగ్ మొదలయ్యే వరకు గడిచే ఆ రెండు రోజులే అసలైన ‘టర్నింగ్ పాయింట్’గా మారనున్నాయి. ఈ తతంగమంతా ఒక ఎత్తు అయితే.. చివరి రెండు రోజులు జరగనున్న పంపకాలు, విందులు, వినోదాలు మరో ఎత్తు.

మలుపు తిప్పనున్న ‘రెండు రోజులు’

ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉన్న నేతలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న మేజర్ మున్సిపాలిటీలలో ఓటుకు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధం కాగా, చిన్న మున్సిపాలిటీలలో రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. కేవలం నగదు మాత్రమే కాకుండా.. మద్యం, మాంసం పంపిణీ ఇప్పటికే రహస్యంగా మొదలైంది. రానున్న రెండు రోజుల్లో ఈ పంపిణీలు మరింత జోరు అందుకోనున్నాయి.

గుండు గుత్తగా ఒప్పందాలు!

వార్డుల్లోని కొన్ని వీధులు, కులాలు, మతాల వారీగా ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు అభ్యర్థులు సరికొత్త ‘డీల్స్’ కుదుర్చుకుంటున్నారు. దేవాలయాల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు, స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ఆయా వర్గాల పెద్ద మనుషులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఆరితేరిన వారు, కులాల వారీగా పెద్దమనుషులను గుర్తించి వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ గెలుపు కోసం స్థాయికి మించి ఖర్చు పెడుతుండటం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఎత్తులకు పైఎత్తులు..

వార్డు అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ నేతలు రంగంలోకి దిగారు. వార్డుల వారీగా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ.. బలహీనంగా ఉన్న చోట పరిస్థితిని చక్కదిద్దేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థులను గట్టెక్కించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ప్రచారం ముగిసిన తర్వాత నుంచి సాగే ఈ ‘షార్ట్ కట్’ పద్ధతులే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయనున్నాయి.

Next Story