విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలి : ఇన్ చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్

by Ratna Kumari |

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని, ఇలాంటి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలతో వారి ప్రతిభ కనబడుతుందని నారాయణ పేట ఇన్ చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు.

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలి : ఇన్ చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్
X

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని, ఇలాంటి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలతో వారి ప్రతిభ కనబడుతుందని నారాయణ పేట ఇన్ చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. తనకు సైన్స్ అంటే చాలా ఇష్టం అని, అలాగని మిగతా సబ్జెక్టులు ఇష్టం లేదని కాదు అని అన్నారు. తాను ఓ ఇంజినీర్ అని ఆయన తెలిపారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణ పేట మండలంలోని జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ( సైన్స్ ఫేర్) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న తనకు నారాయణపేట జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారని, ఈ రోజు ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి

ఇలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. తనకూ ప్రయోగాలు చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు అని, చిన్నపుడు తమ ఇంట్లో ఒక ఎలక్ట్రీషియన్ స్విచ్ బోర్డు కనెక్షన్ ఇవ్వడం చూసి తాను స్విచ్ బోర్డు రిపేర్ చేశానని, కానీ అప్పుడు బోర్డ్ మొత్తం కాలిపోయిందని చెప్పారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుండాలని, ఫెయిల్ అయినా నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. బాటిల్ కి రంద్రాలు పెట్టి నీళ్ళు ఎంత శాతం బయటికి వెళ్తాయో పరీక్షించాలన్నారు. చదువు పరంగా విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతి, సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు ఎక్కువ సమయం తరగతి గదుల్లో గడపాలని ఆయన సూచించారు. జిల్లాకు చెందిన విద్యార్థులు ఎక్కడో శ్రీహరి కోటకు వెళ్లాల్సిన అవసరం లేదని, మన జిల్లా (కొడంగల్ నియోజక వర్గం)లోని కోస్గిలోనే వచ్చే విద్యా సంవత్సరం లోపు బిర్లా ప్లానిటోరియం ఏర్పాటు అవుతుందని, అలాగే దౌల్తాబాద్ లో సైన్స్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తు అంతా మీదే అని, తల్లిదండ్రుల కల నెరవేర్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో డ్రగ్స్ ప్రభావం ఉందని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. జీడీపీ ప్రకారం మన దేశం నాలుగో స్థానంలో ఉందని, ఇంకా మెరుగు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు మంచి జ్ఞానం ఇవ్వడం మా బాధ్యత అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు గురువులకు గౌరవం ఇవ్వాలన్నారు. నిత్య జీవితంలో సైన్స్ ఒక భాగం. జాతీయ సైన్స్ ఫిక్షన్ దినోత్సవం రోజున జిల్లాలో ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలన్నారు. కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ లోనూ ప్రతిభ చాటాలని విద్యార్థులకు సూచించారు. ఇండియా, చైనా దేశాలలో రోబో ద్వారా సేవలు పొందడం జరుగుతోందని, కరోనా సమయంలో రోబోల చేత మందులు పంపించిన ఘనత కూడా ఉందని ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ తెలిపారు. ఫిక్షన్ డెవలప్ త్రూ సైన్స్ అని చెబుతూ ఇలాంటి సైన్స్ ఫేర్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుత సమాజంలో సైన్స్ ముఖ్యం అని, సైన్స్ లేనిదే జీవితం లేదు అని ట్రైనీ కలెక్టర్ స్పష్టం చేశారు. దక్షిణ భారత స్థాయితో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయి సైన్స్ ఫేర్ లలోనూ ప్రతిభ చాటి ప్రపంచానికి మనమేంటో చూపించాలన్నారు.

రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ

బావి భారత శాస్త్రవేత్తలుగా జిల్లా విద్యార్థులు ఎదిగి నోబెల్ బహుమతి సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ఆకాంక్షించారు. అంతకు ముందు రోడ్డు భద్రత మాసోత్సవాలు - 2026 పోస్టర్లను ఆర్టీవో మేఘా గాంధీతో కలిసి ఇన్ ఛార్జీ కలెక్టర్, అదనపు కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే రహదారి భద్రత నియమాలు పాటిస్తామని అందరూ సామూహిక ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఇన్ ఛార్జీ కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ తో కలిసి ఇన్స్ ఫైర్ అవార్డ్స్ - 2024- 25 కు సంబంధించిన ప్రదర్శనలను ప్రారంభించారు. సౌర సైకిల్, బుజ్ వైర్, అంబులెన్స్ లైన్ క్లియర్, ఆటోమేటిక్ ఇంజన్ లాకింగ్ సిస్టం, ఫ్లడ్ ప్రొటెక్ట్ హోమ్, స్మార్ట్ షూ, సీలింగ్ డస్ట్ క్యాచర్ విత్ అంబ్రెల్లా, ఆటోమేటిక్ ఫాగ్ మేకర్ మిషన్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్,రి ఫారెస్టేషన్ విత్ డ్రోన్, పచ్చిరొట్టెల ఎరువులు, సూక్ష్మ జీవ నాశని - కలుపు మొక్కల తీసివేత ప్రయోగాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్, ఎంపీపీ శివారెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్, సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్, నాగార్జున రెడ్డి, ఆర్టీవో నెంబర్ పోషల్ రాజేష్ , ఏం ఓ వో విద్యాసాగర్, సీఎంఓ రాజేంద్ర కుమార్, ఎంఈఓలు బాలాజీ, ఆంజనేయులు, కృష్ణారెడ్డి, వెంకటయ్య, మధ్యాహ్న భోజన పథకం సమన్వయకర్త యాదయ్య శెట్టి, ప్రవేట్ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు కే. సుదర్శన్ రెడ్డి, ట్రెస్మా రాష్ట్ర కార్యదర్శి రాజేష్ కుమార్, తపస్, పి ఆర్ టి యు సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిల్లాకు చెందిన జీ హెచ్ ఎంలు పాల్గొన్నారు.

Next Story