తొలి పంట రైతు ఇంట సిరుల పంట

by Ratna Kumari |

కోడేరు మండలం జనుంపల్లి గ్రామంలో 2022- 23 సంవత్సరంలో పామాయిల్ నాటి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరం పంట కాపు వచ్చిన ఆయిల్ పామ్ పంట గెలలను రైతు వెంకట్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో కోత కోశారు.

తొలి పంట రైతు ఇంట సిరుల పంట
X

దిశ, కోడేరు : కోడేరు మండలం జనుంపల్లి గ్రామంలో 2022- 23 సంవత్సరంలో పామాయిల్ నాటి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరం పంట కాపు వచ్చిన ఆయిల్ పామ్ పంట గెలలను రైతు వెంకట్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో కోత కోశారు. అదే గ్రామంలో రైతు ఎర్రోళ్ల రాజు తనకున్న నాలుగున్నర ఎకరాలల్లో సాగు చేసిన పామాయిల్ తోట కూడా కోత కోశారు. గెల 15 నుంచి 20 కిలోల వరకు తూకం వస్తుంది. నాలుగున్నర ఎకరాలల్లో మొదటి సంవత్సరానికి 8 నుంచి 10 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన శాఖ ఎం, లక్ష్మణ్ తెలిపారు. తొలి సారిగా పంట కోత కార్యక్రమానికి జిల్లా ఉద్యాన,పట్టు పరిశ్రమ అధికారి ఎం. వెంకటేశం మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో 2160 మంది రైతులకు గాను 8131 ఎకరాలలో పామాయిల్ సాగును చేపట్టిన‌ట్టు తెలిపారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో 523 మంది రైతులకు 1690 ఎకరాలలో పామాయిల్ సాగును చేపట్టిన‌ట్టు చెప్పారు. కోడేరు మండలం జనుంపల్లి గ్రామంలో 2022 సంవత్సరంలో సాగు చేసిన సుమారు 100 నుంచి 120 ఎకరాలలో ఈ నెల నుంచి గెలలను కోయడం ప్రారంభమైందని ఆయన వివరించారు. ఈ గెలలను కోసిన పిదప కలెక్షన్ పాయింట్ వరకు రైతులు చేరవేర్చాలి. ఆ తరువాత ఫ్యాక్టరీకి కంపెనీవారు తీసుకెళ్లడం జరుగుతుందనీ ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా పామాయిల్ చట్టం 1993 ప్రకారం ప్రతి నెల కేటాయించబడిన మెట్రిక్ టన్ను ధర ప్రకారం రైతులకు 15 రోజులలో వారి ఖాతాలలో ఆ డబ్బును జమ చేయడం జరుగుతుందనీ ఆయన తెలిపారు. ఈనెల ఒక టన్ను పామాయిల్ ధర 21546 రూపాయలు ఉంది. దీని ప్రకారం ఈ నెలలో కోయబడిన గెలలు ఆదే రేటు ప్రకారం రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు.

రైతు సోదరులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంటను సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి వెంకటేశం చెప్పారు. ఒక ఎకరం వరి సాగు చేసే నీటితో 3-4 ఎకరాల ఆయిల్ పామ్ సాగును చేపట్టవచ్చనీ, పామాయిల్ పంటకు ఒక ఎకరానికి 50-57 మొక్కలు నాటుకోవచ్చ న్నారు. ఒక మొక్క పూర్తి ధర 193 రూపాయలు కాగా ప్రభుత్వం కేవలం 20 రూపాయలకే ఒక మొక్కను రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. పంటకు కావాల్సిన‌ డ్రిప్ ఇరిగేషన్ నీ సబ్సిడీపై రైతులకు అందజేయ‌నున్న‌ట్టు తెలిపారు. పంట నిర్వాహణ‌కు ఒక ఎకరానికి రూ. 4200 చొప్పున నాలుగు సంవత్సరాలకు రూ. 16,800 ఒక ఎకరానికి రైతులకు సబ్సిడీ పైన అందించడం జరుగుతుందన్నారు. పంట నాలుగో సంవత్సరం నుంచి కాపుకొచ్చి 25 నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుందనీ ఆయన స్పష్టం చేశారు. అకాల వర్షాలు, వడగండ్లు గాని ఈ పంటపై ఎలాంటి ప్రభావం చూపదనీ, ఆసక్తి గల రైతు సోదరులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వెంకటేశం పేర్కొన్నారు.

Next Story