బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని పాడు చేశారు.. మాజీమంత్రి కంటత‌డి

by Ratna Kumari |

బీఆర్ఎస్ హాయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా, వాటిని పూర్తిగా విస్మరించి పాడు చేశారని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు.

బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని పాడు చేశారు.. మాజీమంత్రి  కంటత‌డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బీఆర్ఎస్ హాయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా, వాటిని పూర్తిగా విస్మరించి పాడు చేశారని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఆయన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తాను చేపట్టిన అభివృద్ధి పనులు ఆగిపోవడం చూసి చలించిపోయి కంటత‌డి పెట్టుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ తన హాయాంలో నిర్మించిన వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్య పరీక్షల పరికరాల కోసం 500 కోట్ల టెండర్లు ఎందుకు పిలవడంలేదని ప్రశ్నించారు. అలాగే హరిత హోటల్, టౌన్ హల్, మాంసాహార మార్కెట్, ట్యాంక్ బండ్, శిల్పారామం, మైనార్టీ గురుకులాలు, మన్యంకొండ రోప్ వే పనులను ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. పట్టణంలో మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి చేత కావడంలేదని, మార్కెట్ కోసం నిర్మించిన డిజైన్ లో గ్రంథాలయం ఎలా నిర్మిస్తారని, ఆ డిజైన్ వేరే ఉంటుందని అన్నారు. మెట్టుగడ్డ లో నిర్మాణంలో ఉన్న మార్కెట్ మొత్తం మందు బాబులకు అడ్డాగా మారిందని, అక్కడ కుక్కలు, పందులు, పాన్, గుట్కా, తాగుబోతులకు అడ్డా గా మారిందని చలించిపోయారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, తాను ఇప్పటిదాకా పర్సనల్ గా విమర్శించలేదని, తాను మాట్లాడడం మొదలుపెడితే వంద వస్తాయని ఆయన మండిపడ్డారు. విమర్శలు మాని అభివృద్ధి పై ద్యాస పెట్టాలని ఆయన హితవు పలికారు. ఆయన వెంట గంజి వెంకన్న, కెసి నర్సింహులు, రహెమాన్ ఉన్నారు.

Next Story