ప్ర‌జాపాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం గొప్ప ఆలోచ‌న

by Nallavelli.Anjaneyulu |

గ్రామం, మండలం, పట్టణాలు మరింతగా అభివృద్ధి చెందడానికి 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం గొప్ప ఆలోచన అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

ప్ర‌జాపాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం గొప్ప ఆలోచ‌న
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గ్రామం, మండలం, పట్టణాలు మరింతగా అభివృద్ధి చెందడానికి 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం గొప్ప ఆలోచన అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం అమలుపై మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడో విడతగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 12 న జరిగే ప్రజాప్రతినిధుల శిక్షణ చాలా ముఖ్యమైనదని కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్ధని మంత్రి సూచించారు. గ్రామ సభల్లో త్రాగు నీటి సమస్యను ప్రజలు ప్రస్తావించే అవకాశం ఉందని, ఆ సమస్యను ముందస్తుగా పరిష్కరించేందుకు అధికారులు దృష్టి సారించాలని సూచించారు.గ్రామ సభల్లో ఎక్కువ ఏ ఏ దరఖాస్తులు వస్తాయో అధికారులు అంచనా వేయాలన్నారు.రెండున్నర సంవత్సరాల ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధీ పొందినవారి వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలన్నారు. లబ్ధీదారుల జాబితా, నోడల్ అధికారుల జాబితా, దరఖాస్తుల వివరాలను అధికారులు మంత్రులకు, ఎమ్మెల్యే లకు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో పెండింగ్ పనులు ఏం ఉన్నాయో కనీస సమాచారం ఉండాలని, పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్తామని మంత్రి వెల్లడించారు. మహిళల పాత్ర ఎంతో కీలకమని, ఏ రాష్ట్రంలో ఇవ్వని పథకాలు మన రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్నామని, 46 లక్షల మంది మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలోని 10 థీమ్స్ చాలా బాగున్నవని మంత్రి కితాబిచ్చారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ, వేసవిలో త్రాగు నీటి సమస్య, తొలకరిలో మొక్కలు నాటే ప్లాంటేషన్ కార్యక్రమం, రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు-ఉపాద్యాయుల నిష్పత్తిని పరిశీలించి ఉపాద్యాయుల కొరత ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో ఉన్న ప్రతి అంశానికి సంబంధించిన సరైన ప్రచారం నిర్వహించి, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కొన్ని ఇళ్లు ఎల్2,ఎల్3 రిజెక్షన్ల కారణంగా నిలిచిపోయి పెండింగ్లో ఉన్నాయని, సమీక్షించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కారానికి అధికారులు చురుకుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ, నారాయణపేట, గద్యాల జిల్లాలో మైనార్టీ లబ్ధీదారులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ లో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్త, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్, వనపర్తి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు,మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జి.మమత, డిఫ్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత, ఆయా జిల్లాల ఆర్డీవో లు మున్సిపల్ కమిషనర్లు డిఆర్డీవోలు,డిపివోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Next Story