- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ పదవీని ఆమోదించమని మళ్లీ అడుగుతున్నా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఎన్నో పోరాటాలు.. త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ తెలంగాణ ఆగం కాకుండా పోరాటాలు సాగిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఎన్నో పోరాటాలు.. త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ తెలంగాణ ఆగం కాకుండా పోరాటాలు సాగిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాట.. తెలంగాణ జాగృతి కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు జిల్లా పర్యటనకు వచ్చిన కవిత బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పర్యటనలో అనేక సమస్యలు తను దృష్టికి రావడం జరిగిందని కవిత చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేను పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకుంటారు. కానీ ఆయన ఎంపీ ఎన్నికల సమయంలో మినహాయించి ఏ ఒక్కరోజు మహబూబ్ నగర్ వచ్చిన దాఖలాలు లేవు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి పాలమూరు నీటి గోసా తీరుస్తాము అని గొప్పగా చెప్పారు. గతంలోనే 80 నుంచి 90 శాతం పనులు పూర్తి చేసుకుంది పాలమూరు. రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే కెసిఆర్ కు గుర్తింపు వస్తుంది అనే భావనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టడం లేదన్నారు. సీఎం నారాయణపేట.. కొడంగల్ ప్రాజెక్టు చేపట్టి పూర్తి చేయండి. అందులో తప్పులేదు. కానీ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి అని కవిత డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసుకోకుంటే ఆల్మట్టి ఎత్తు పెంచి కర్ణాటక.. మిగతా నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వినియోగించుకుంటే.. అప్పుడు ఈ ప్రాంతమంతా క్రికెట్ ఆడడానికి మాత్రమే పనికి వస్తుంది అన్నారు.
జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తే.. అది ఇప్పుడు 50 పడకల ఆసుపత్రి గా మారింది. పేదోళ్లు వైద్యం కోసం వస్తే మెరుగైన వైద్య సేవలు అందించే పరిస్థితులు లేవు. జడ్చర్ల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద పడకల ఆసుపత్రిలో కరెంటు లేదు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మారెడ్డిని తీసుకువచ్చి ఆసుపత్రిలో కట్టేస్తే కరెంటు వస్తుంది అన్నాడు. మరి ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి 50 పడగలకు చేరి.. సరైన వైద్య సేవలు అందనందుకు మిమ్మలను ఏం చేయాలి అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులు, గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదు.. గెజిట్ లో లేదు అన్న ఒక కారణంతో ఆయన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లిని మార్చుకోవాలా అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మంత్రివర్గంలో మైనారిటీలు, గిరిజనులకు స్థానం కల్పించని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అన్నారు. ఎస్సీ, ఎస్టి రిజర్వేషన్లతో పాటు బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని పార్టీలతో కలుపుకొని ఢిల్లీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
గ్రామపంచాయతీలుగా ఏర్పడిన తండాలలో అంగన్వాడీలు కూడా ఏర్పాటు కాలేదని కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బతకమ్మను ఎత్తుకొని ప్రపంచవ్యాప్తంగా తిరిగాను. మన రాష్ట్ర ఏర్పాటు కోసం జాగృతి తరపున కృషి చేశామని ఆమె వెల్లడించారు. అదే స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం.. ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడుతాము అన్నారు. ఎమ్మెల్సీ గా నేను బీఆర్ఎఎస్ నుంచి పోటీ చేసి గెలిచాను.. ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను. నా రాజీనామాను ఆమోదించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశాను. కానీ కాంగ్రెస్ పాలకుల సమస్యలు ఏమున్నాయో..? తెలియదు. వాళ్ల ప్రయోజనాల కోసం నా రాజీనామాను ఆమోదించడం లేదు. ఇప్పుడు చెబుతున్న.. రాజీనామాను ఆమోదించాలి అని కవిత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిన ఈ ప్రభుత్వం దోపిడికి పాల్పడుతుందని విమర్శించారు. మంత్రుల దోపిడిని అరికట్టేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో షాడో లోని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా రూపొందించే అవకాశం ఇప్పట్లో లేదు అని.. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు అన్ని రకాల కమిటీలు వేసి తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం పోరాడుతామన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రశ్నించేవారు ఎవరైనా ఉంటే.. వాళ్ల వెనకాల వీరున్నారు.. వారున్నారు అంటూ విమర్శలు వస్తూ ఉంటాయి.. అలాగే నా పైన వస్తున్నాయి. నా వెనకాల ఎవరూ లేరు.. నా ముందర మాత్రం ప్రజలు ఉన్నారు. ప్రజల మద్దతుతోనే కార్యక్రమాలను కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.
అతను గమ్మత్తు.. ఇతను విమర్శలు
మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గమ్మత్తుగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా గెలిచిన 24 గంటలలోనే పుల్లూరును మండల కేంద్రంగా చేస్తాను అన్నాడు. కానీ ఇంతవరకు అతిగతి లేదు అని చెప్పారు. మిగతా విషయాలలో ఎమ్మెల్యే ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలియదు అన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడో.. బీజేపీలో ఉన్నాడో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. కానీ మాకు రెండు లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయలేని పరిస్థితులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పైనే విమర్శలు చేస్తున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే పరిస్థితి మరోలా ఉంది.. కురుమూర్తి దేవాలయం వద్ద గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి రోడ్డు మంజూరు చేయించి .. సగం వరకు పూర్తి చేయిస్తే.. ఆ రోడ్డును పూర్తి చేయకుండా మరో రోడ్డును ఎమ్మెల్యే జీఎంఆర్ సగం వరకే వేయించారన్నారు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రోడ్డు పూర్తి చేయాలి. కానీ సగం సగం పనులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తెలంగాణ జాగృతి పోరాడుతుంది అని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రామ్మూర్తి ఉన్నారు.






