- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, జోగులాంబ గద్వాల ప్రతినిధి : రాజకీయ నాయకులు ఎంతో అర్భాటంగా తొడిగే ఖద్దరు చొక్కా వెనుక ఇతరులెవ్వరికి తెలియని కన్నీటి వ్యథలెన్నో ఉంటాయి. రాజకీయం అనేది ఒక రంగుల ప్రపంచం అని మేధావులు అనేక సందర్భాల్లో చెబుతుంటారు. కానీ అవేమి లెక్క చేయకుండా రాజకీయ రొంపిలోకి దిగి విలవిల లాడే ఉద్దండులు ఎందరో మనకు ప్రతిరోజూ తారస పడుతూనే ఉంటారు. మహాసముద్రం లాంటి ఈ రంగుల ప్రపంచంలో దిగి ఈదలేక, తిరిగి ఒడ్డుకు చేరుకోలేక నిరీక్షిస్తూ కూర్చున్న వారు నేటి సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. రాజకీయం అంటే అదేదో మహా అధ్భుత లోకమని భావించి యాదృచ్చికంగా ఆరంగంలో ప్రవేశించిన వారు పీకల్లోతు కూరుకుపోయి వెనక్కి రాలేక లోలోన వెక్కివెక్కి ఏడుస్తున్న సంధర్భాలు సమాజంలో అనేకం. రాజకీయాల్లో ఉన్నా మునుపటి జీవితం కోసం నిరీక్షిస్తున్న నాయకులెందరో మనకు తారస పడతారు. ఖద్దరు వేసుకున్న కొందరు జీవితాల్లోకి తొంగి చూస్తే వారు పంటి బిగువున భరిస్తున్న భాధలెన్నో మనకు తెలుస్తాయి.
రాజకీయ మోజుతో జీవితాలు అధోగతి..
రాజకీయ మోజు ఎందరో జీవితాలను అతలాకుతలం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకుడి పరిస్థితి ఏమో గానీ, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రాజకీయం చేసే వారికి రోజువారి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సర్పంచు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, సింగిల్ విండో ఛైర్మన్ తో పాటూ ఇతరత్ర నామినేటెడ్ పదవులు అణుభవించే వారు సంపాదించేది దేవుడెరుగు కానీ, రోజూ చేస్తున్న అడ్డగోలు ఖర్చులు మాత్రం తడిసి మోపెడౌతున్నాయి. అధికారం అనే హోదాతో దర్పం కోసం నిత్యం చేసే ఖర్చులు పెరిగి ఎందరో నాయకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పదవుల మీద ఉన్న అతి వ్యామోహంతో ఎన్నికల్లో తలపడి కోట్ల ఖర్చులకు వెనుకాడటం లేదు. ఈ క్రమంలో సంసార జీవితాలు అతలాకుతలం అయినా రాజకీయాల్లో ముందుకే వెలుతున్నారు తప్ప, వెనుకడుగు వేసేందుకు మాత్రం ససేమీరా అంటున్నారు. ఎన్నికల్లో ఓడిన వారు ఖర్చు చేసిన మొత్తం వెనక్కి రాక నష్టపోతే, గెలిచిన వారు హోదా తగ్గకుండా చేసే ఖర్చులతో అదనంగా మరింత నష్టపోతున్నారు.
హోదాకు కారుంటేనే కరెక్ట్ అనుకుంటున్నారు..
నాటి రాజకీయాల్లో ఓ స్థాయికి ఎదిగి, ఆర్థికంగా ఉన్న నాయకులే కార్లు కలిగి ఉండేవారు. కానీ నేటి రాజకీయాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. గ్రామస్థాయిలోనే సర్పంచు, ఎంపీటీసీ లాంటి పదవుల్లో గెలిచిన వెంటనే దర్పం కోసం కార్లను కొనుగోలు చేస్తున్న నాయకుల సంఖ్య పెరిగింది. ఓ లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి నెలవారి వాయిదాల్లో కార్లను కొంటున్న సందర్భాలను మనం చూస్తున్నాము. ఇటువంటి కార్లలో రోజూ నలుగురికి తగ్గకుండా నాయకుడు తనవెంట కార్యకర్తలను ఎక్కించుకు తిరగాల్సిందే. ఈ నలుగురి రోజువారి ఖర్చులు కూడా సదరు నాయకుడే భరించటం రాజకీయాల్లో పరిపాటిగా మారింది. ఈ విధంగా రోజుకు గ్రామస్థాయి నాయకుడికి రూ, 2000 నుండి రూ, 3000 వరకు ఖర్చయ్యే పరిస్థితి ఉంది. ఇతరత్రా చందాలు, సమావేశాల ఖర్చులు, తన కుటుంబ అవసరాల తీర్చే తదితర ఖర్చులన్ని అదనం. ఈ రకంగా చూసినా నెలకు రూ, 70,000 నుండి రూ, 1,00,000 వరకు గ్రామస్థాయి నాయకుడికి ఖర్చులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి.
ఏడాదికి రూ, 10 లక్షలకు మించి ఖర్చు..?
కొందరు గ్రామస్థాయి నాయకులకు నెలకు కార్యకర్తల మెయింటెనెన్స్, కారు ఈఎమ్ఐ, డీజీల్ (పెట్రోలు) ఖర్చులు కలిపి ఈజీగా లక్ష దాటుతుండటం మనం చూస్తూనే ఉన్నాము. ఆవిధంగా లెక్కించినా ఏడాది తిరిగేలోపు పది లక్షలు మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోట్లు గడించి, ఆస్థిపాస్తులు ఉన్న నాయకులను అటుంచితే, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చే నాయకుల పరిస్థితి రాజకీయాల్లో ఎలా ఉంటుందో ఆలోచిస్థేనే భయమేస్తుంది. ఇటువంటి వారే కొంత కాలం గడిచిన తరువాత ప్రిస్టేజీ కోసం వంశ పారంపర్యంగా పెద్దల నుండి తమకు సంక్రమించిన అయిదేకరాల వ్యవసాయ పొలం నుండి ఎకరమో, రెండెకరాలో విక్రయించటమో, తాకట్టు పెట్టటమో చేసి డబ్బులు సర్దుకుని తెల్లారేసరికి శరీరంపై ఖద్దరు దుస్తులు ధరించి నిన్నటి లాగానే ముఖం మీద చిరునవ్వు చిందిస్తూ ప్రజలతో మమేమకం అవుతున్న నాయకులు మన కళ్ల ముందే ఎందరో కనిపిస్తున్నారు. మరీ కొందరైతే హోదాకు తగ్గి బ్రతకలేక అందుకు తగ్గ సంపాదన లేక పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం అప్పులు చేస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
జనం కూడా తక్కువేమి కాదు..
ఎన్నికల వాతావరణం మొదలైనప్పటి నుండి ఎన్నికలు ముగిసే వరకు రాజకీయాల్లో ఒక స్టెప్పు. గెలిచి పదవిని పొందిన నాటి నుండి పదవీ కాలం ముగిసే వరకు మరో స్టెప్పు. మొదటి స్టెప్పులో రాజకీయ పోటీ ప్రత్యర్థి కంటే మనమే ముందుండాలని తమకున్న ఆలోచన విధానాన్ని తమ నాయకుడిపై రుద్ది అడ్డూ, అదుపు లేకుండా ఖర్చు పెట్టించేందుకు వెనుకాడటం లేదు. ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తే గెలుపుకు అంత దగ్గరగా ఉంటామని తమ నాయకుడికి నూరి పోయటం చాలా మంది పనిగా పెట్టుకుంటారు. ఇరువైపుల ఉన్న నాయకుల వద్ద ఇటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. ఎన్నికల్లో ఖర్చు పెరిగేందుకు ఇటువంటి వారు చెబుతున్న అనాలోచితమైన ఆలోచనలు కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఆదివారం వచ్చిందంటే మటన్ బిర్యానీతో విందు, మందు. మంగళవారం అయితే చికెన్ బిర్యానీతో విందు, వినోదం. శుక్రవారం అయితే చేపఫ్రై తో డిన్నర్ ఉంటేనే మన వెనకాల ఓటర్లు ఉంటారంటూ చెవిలో జోరిగల్లాగా ఊదుతూనే ఉంటారు మరి కొందరు. అంతా పురుషులకేనా మహిళా ఓటర్లకు ఒక్కొక్కరికి కనీసం రూ, 500 తక్కువ కాకుండా ఇస్తేనే మనకు గంప గుత్తగా ఓట్లు పడతాయని చెప్పేందుకు మరో బ్యాచ్ రెడీగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు ఏం పాపం చేశారు వారికి కూడా చెరో రూ, 500 చేతికిచ్చి, స్ర్టాంగ్ బీర్లు, ఫ్రై చేసిన మాంసాహారంతో విందులు ఏర్పాటు చేస్తే మన గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పే మహాను భావులు ఎందరో ! ఎవరి చెప్పింది నిజమో, ఎవరు చెప్పింది అబద్దమో, వాస్తవం ఏదో ఆలోచించే టైం లేక గెలుపే ద్వేయంగా ఎన్నికల్లో ఖర్చులు పెట్టడం పోటీ చేసిన నాయకులకు సర్వ సాధారణం అయింది.
రాజకీయాల్లో ఆదాయం ఉంటుందా..?
వాస్త పరిస్థితుల దృష్ట్యా రాజకీయం అంటే సేవా దృక్పథం. కానీ రాజకీయం అంటే ఒక ష్యాషన్ గా మారి కోట్ల సంపాదనకు తనకు వచ్చే పదవి కేంద్ర బిందువుగా ఉందనే భ్రమలో గ్రామీణ యువకులు, నాయకులు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. గ్రామ పంచాయితీ సర్పంచుగా గెలిస్తే కొంత ఆర్థిక అధికారం ఉంటుందేమో గానీ లక్షలు, కోట్లు మిగిలించుకునే పరిస్థితులు ఇక్కడ ఉండవన్నది సత్యం. ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎంపీపీ , జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికకు అవసరమైన మెజారిటి సంఖ్యగా చెప్పుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుండగా, ఈ పదవులకు రాజ్యాంగంలో ప్రత్యేక అధికారాలు కానీ, నిధులు కానీ ఏమి ఉండవన్న విషయం పోటీ చేసే నాయకులకు తెలియకపోవటం కూడా చాలా దురదృష్టంగా చెప్పవచ్చు. జిల్లా, మండల పరిషత్ లకు, గ్రామపంచాయితీలకు మాత్రేమే జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆర్థిక సంఘాల ద్వారా కొంత నిధులను విడుదల చేస్తాయి. రెండు, మూడు వేల ఓటర్లు ఉన్న గ్రామాలకు ఏడాదికి రూ, 10 నుండి రూ, 15 లక్షలకు మించి నిధులు అందని పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా విడుదల అయిన నిధులను కూడా ప్రత్యేక నిబంధనల మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది తప్ప, ఎన్నికైన ప్రజాప్రతినిధి ఇష్టాను సారంగా ఖర్చు చేసే అవకాశం మాత్రం ఉండదు. కానీ ఇవన్నీ తెలియక కొందరు ఎన్నికల్లో పోటీ చేసి రూ, 30 లక్షల నుండి రూ, 50 లక్షల వరకు ఖర్చులు పెట్టి ఆర్థికంగా దివాళా తీస్తున్నారు.
ఆలోచనా విధానాలు మారాలి..
రాజకీయ పదవుల కోసం పోటీ చేసే నాయకులతో పాటూ, వారికి ఓట్లేసే ప్రజల ఆలోచనా విధానాలు సైతం మారాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. తాజాగా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం జోరందుకుంది. ఏ నలుగురిని కదిలించినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఎవరు ఎంత ఖర్చు పెడతారో అనే చర్చలే అధికంగా ఉంటున్నాయి. ఓటుకు నోటు ఆశించకుండా ఓటరు తమ ప్రాంత అభివృద్ది కోసం ఓటు వేస్తానని ఓటరు, తాను గెలిచేందుకు ఓటర్లను ఎటువంటి ప్రలోభావాలకు గురిచేయనని నాయకుడు ప్రతిజ్ఞతో ఎన్నికల కార్యక్షేత్రంలోకి అడుగు పెట్టినప్పుడే అభివృద్ది పరుగులు తీయటంతో పాటూ, ఖద్దరు చొక్కా వెనుకాల ఉన్న కన్నీటి వ్యథలు పటాపంచలౌతాయి.
విలువల్లేవు : ప్రహల్లాధరెడ్డి, మాజీ ఎంపీపీ, అయిజ మండలం.
నేటి రాజకీయాల్లో విలువలు మచ్చుకు కనిపించటం లేదు. ప్రజలు కూడా ఎక్కువగా తమ స్వార్థం కోసం నాయకులను వాడుకునే పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాల్లో ప్రతి వ్యవహారం డబ్బుతో ముడిపడి ఉంటుంది. అభివృద్ది అనేది రోజు రోజుకు కుంటుపడుతుంది. విలువలతో ఉన్నవారు రాజకీయాల్లో పనిచేయలేరు.
నోటు లేకుండా ఓటెయ్యాలి : తాహెర్, సామాజికవెత్త, రెడ్ క్రాస్ సంస్థ ఉపాక్షుడు, గద్వాల జిల్లా
ఓటర్లు ఎన్నికల సమయంలో నోటు లేకుండా ఓటెయ్యాలి. ఓట్లకు డబ్బులు అడగటం కూడా సర్వ సాధారమైంది. ఓటును అమ్ముకుంటే అభివృద్ది కావాలని అడిగే హక్కు కూడా కోల్పోతాము. నాయకులు కూడా డబ్బులు పంచకుండా ఓట్లడగాలి. కానీ నాయకులే ముందుగా ఓటర్లను ప్రలోభపెడుతున్నారు.
యువత ఆలోచించాలి. సిద్దార్థ, ప్రిన్సిపల్, అయిజ మున్సిపాలిటీ
నేటి బాలలు రేపటి పౌరులు. ఎన్నికల విషయంలో నేటి యువత ఆలోచన తీరు మారాలి. చాలా మంది యువత ఎన్నికల సమయంలో నాయకులను ఆర్థికసాయం చేయాలని ఆశిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. గెలిచిన తరువాత తమ ప్రాంతంలో చేసే పనిని యువత నాయకుడి ముందుంచాలి.






