రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ఉపాధ్యాయుల విజ్ఞప్తి

by Ratna Kumari |   (  Updated:2025-10-15 15:24:21  IST  )

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుడుముల కొండయ్య , ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 25 సంవత్సరాలకు పైగా

రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ఉపాధ్యాయుల విజ్ఞప్తి
X

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం కొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుడుముల కొండయ్య.. రెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 25 సంవత్సరాలకు పైగా సేవలు అందించి, గత సంవత్సరం సెప్టెంబర్ 2, 2024న పదవీ విరమణ చేశారు. విద్యా సేవలో నిబద్ధతతో అనేక తరాల విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన ప్రస్తుతం తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. గత రెండు వారాలుగా మహబూబ్‌నగర్‌లోని నవోదయ ఆసుపత్రిలో ఐసియు లో చికిత్స పొందుతూ, రోజుకు సుమారు రూ/ 20,000 ఖర్చవుతోంది. ఇప్పటివరకు మూడు లక్షల రూపాయలకు పైగా వైద్య వ్యయాలు అయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు చేసి చికిత్స కొనసాగిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆయనను ఇంటికి తరలించి ఆక్సిజన్‌పై ఉంచిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం.

ఇదిలా ఉండగా, ఆయన పదవీ విరమణకు 14 నెలలు గడిచినా, గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా అందలేదని సహ ఉపాధ్యాయులు తెలిపారు. తక్షణమే బకాయిలు విడుదల చేసి, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఈ విశ్రాంత ఉపాధ్యాయుడికి ప్రభుత్వం సాయం చేయాలని గండీడ్, మహమ్మదాబాద్ మండల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని వినతి పత్రం ద్వారా కోరారు. వారు ప్రభుత్వాన్ని వేడుకుంటూ.. “అనారోగ్యంతో బాధపడుతున్న విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వెంటనే ఆయనకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయించి, సకాలంలో వైద్యం పొందేలా చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

Next Story