జడ్చర్లలో స్వైన్ ఫ్లూ కలకలం

by Ratna Kumari |

జడ్చర్ల పట్టణంలో చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ స్వైన్ ఫ్లూ కేసు నిర్ధారణ అయింది.

జడ్చర్లలో స్వైన్ ఫ్లూ కలకలం
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ స్వైన్ ఫ్లూ కేసు నిర్ధారణ అయింది. ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ కావడంతో హెచ్.వ‌న్. ప‌ట్టణ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి ఎన్ వన్ స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యులు అందించిన సమాచారం ప్రకారం, బాధితుడు గత కొన్ని రోజులుగా దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాడు. అక్కడ వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి వైరల్ న్యుమోనియాగా గుర్తించారు. అనంతరం వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పరీక్షల కోసం నమూనాలను ల్యాబ్ కు పంపగా హెచ్ వన్ ఎన్ వన్ స్వైన్ ఫ్లూగా నిర్ధారణ అయంది


రోగిని పరీక్షించిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు వెంటనే మండల వైద్యాధికారులకు ఆ సమాచారం అందించారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై రోగి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు ఆయన నివసిస్తున్న ప్రాంతంలో వ్యాధి మరింత వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.స్వైన్ ఫ్లూ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని జడ్చర్ల డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ళ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరమైతే మాస్కులు వినియోగించడం మంచిదని తెలిపారు.


రోగి చికిత్స పొందుతున్న అస్పత్రి వైద్యులు అందించిన రిపోర్టును పరీక్షల కోసం హైదరాబాదుకు పంపడం జరిగిందని, రిపోర్టు వచ్చేవరకు ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు. రోగి బంధువులను కూడా పరీక్షించడం జరిగిందని వారికి అందుకు సంబంధించిన ఎలాంటి సిండ్రమ్స్ కనిపించలేదని ఆయన వెల్లడించారు. ముందస్తుగా వైద్యశాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నదని, స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు వైద్య ఆరోగ్యశాఖ తీసుకుంటున్నదని ఆయన తెలిపారు.

Next Story