- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైర్మన్ గా సునేంద్ర..?
నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తీగల సునేంద్ర పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తీగల సునేంద్ర పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా.. 18వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించారు. కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధికంగా గెలుపొందగా మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నదని ఇప్పటికే ఖరారైపోయింది. కౌంటింగ్ ప్రక్రియ ముగియగానే సంబరాలు జరుపుకున్న అభ్యర్థులను పార్టీ అధిష్టానం క్యాంపునకు తరలించారు. రెండు రోజుల నుంచి వారంతా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఎలాంటి వివాదాలు రాకూడదనే ఉద్దేశంతో అందరిని సమస్వయం చేసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై క్లారిటీ తెచ్చేందుకు అధిష్టానం ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటోందని తెలుస్తోంది. అధికారం లేనప్పుడు సైతం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న పట్టణానికి చెందిన బలమైన సామాజికవర్గానికి చెందిన యువ నాయకుడు, కౌన్సిలర్ తీగల సునేంద్ర పేరు ఛైర్మెన్ గా దాదాపుగా ఖరారైనట్లుగా సమాచారం. ఎన్నికలకు ముందు నుంచి కూడా ఈయన పేరే వినిపిస్తూ వస్తున్నది కూడా. అయితే వైస్ ఛైర్మెన్ పదవి ఎవరికీ దక్కనున్నదో అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ పదవికి ఎంపికపై రాజకీయ వర్గాల్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 16న నిర్వహించనున్న ప్రమాణ స్వీకారం తర్వాత నిర్వహించనున్న ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నికపైనే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పదవులు ఎవరికీ వరించనున్నాయో సోమవారం తేలనుంది.
చైర్మన్ పదవి సునేంద్రకేనా..?
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడే తీగల సునేంద్ర కౌన్సిలర్గా గెలుపొందారు. అప్పటి అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అందరితో కలుపుగోలుగా ఉండే ఈయనకు వివాద రహితుడిగా పేరుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో రాజేష్ రెడ్డి గెలుపు కోసం కూడా కష్టపడి పనిచేశారు. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్నందున ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు సునిద్రకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి పదవి దక్కుతుందని ప్రజల్లో మంచి ప్రచారం జరిగింది. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే మున్సిపాలిటీ ఛైర్మెన్ గా కూడా అవకాశం కల్పిస్తామని అప్పట్లోనే హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం ఉంది. అనూహ్యంగా అయన ఇది వరకు పని చేసిన వార్డు కాకుండా పక్క వార్డులో బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. ముందు నుంచి మంచి పేరున్న సునేంద్రను పక్క వార్డులో కూడా జనం ఆదరించి మంచి మెజార్టీతో గెలిపించారు. దీంతో ఛైర్మెన్ పీఠానికి సునేంద్ర అర్హత సాధించారు.
ఓడిన ఇద్దరు చైర్మన్ ఆశావహులు
చైర్మన్ పదవి ఆశించిన ఇద్దరు అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 10వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ నాయకుడు, పలు మార్లు వార్డు సభ్యుడుగా ఎన్నికైన హబీబ్ ఛైర్మెన్ పదవి కోసం పోటీ పడినట్లు తెలిసింది. అయన వార్డు మహిళకు కేటాయించడంతో పక్కనున్న వార్డు నుంచి టికెట్ ప్రయత్నించారు. ఈయన ఎంపీ వర్గానికి చెందిన వాడు కావటంతో టికెట్టు కేటాయింపుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జాప్యం, చేసినట్లు తెలిసింది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో రెండు (6,10) వార్డులు తన అనుచరులకు కేటాయించాలని ఎంపీ మల్లురవి వత్తిడి చేయడంతో చివరి దశలో 10వ వార్డును సీనియర్ నాయకుడు హబీబ్ కు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఎమ్మెల్యే, ఎంపీ గెలుపు కోసం పని చేసిన తైలి శ్రీనివాసులు 6వ వార్డు టికెట్టు ఆశించారు. కానీ 6వ వార్డు ఇంఛార్జిగా పని చేసిన ఎమ్మెల్యే అనుచరుడు బలపరిచిన (బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన) అభ్యర్థికి కేటాయించారు. ఎంపీ మల్లు రవి 2 కౌన్సిలర్ సీట్లను కేటాయించామని సూచించగా చివరి దశలో ఒకటే సీటు కేటాయించడం గమనార్హం. దీంతో తైలి శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. నాగర్ కర్నూల్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్న పొడుగు శ్రీనివాసులు తన ఉద్యోగానికి రాజీనామా చేసి, మున్సిపల్ ఛైర్మెన్ పదవి కోసం 2వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో మంచి సంబంధాలు ఉండటంతో ఈయనకు కూడా ఛైర్మెన్ పదవి వరించే అవకాశం ఉన్నది. కానీ ఓటమి పాలుకావడంతో ఆ అవకాశం చేజారినట్లయ్యింది. ఛైర్మెన్ పదవి ఆశించిన ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో సునేంద్ర ఛైర్మెన్ పీఠం అధిష్టించేందుకు మార్గం సుగమమైంది.
వైస్ చైర్మన్ పదవి ఏ వర్గానికో..?
నాగర్ కర్నూల్ పట్టణంలో ఉన్న జనాభాలో మున్నూరు కాపు, ముస్లిం మైనారిటీ, ఆర్యవైశ్యుల జనాభా అత్యధికం. ఛైర్మెన్ పదవి బీసీ జనరల్ రిజర్వేషన్ కావడంతో ముస్లిం మైనార్టీలు లేదా బీసీ వర్గాల్లోని వారికీ వరిస్తుంది. ఆర్యవైశ్య సామజిక వర్గానికి చెందిన వారు ఈసారి తమకు వైస్ ఛైర్మెన్ పదవి కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తున్నది. ఐతే ప్రస్తుతం 8వ వార్డు నుంచి గెలిచిన బాదం రమేష్ వైస్ ఛైర్మెన్ పదవి ఆశిస్తున్నారు. కానీ ఈయన మున్సిపాలిటీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలుపులో భాగమైన కౌన్సిలర్లు చాల మంది ఉండటంతో ఎవరికీ వరించనుందో అన్నది ఉత్కంఠ నెలకొన్నది. పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ ఛైర్మెన్ పదవి మున్నూరు కాపు వర్గానికి ఇస్తే వైస్ చైర్మన్ పదవి మైనార్టీ కౌన్సిలర్ కు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఆ వర్గాల నుంచి ఉంది.






