- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్
మండల పరిధిలోని పోల్కంపల్లి, వంగూరు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనాల పనులను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దిశ, వంగూర్: మండల పరిధిలోని పోల్కంపల్లి, వంగూరు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనాల పనులను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాల భవన నిర్మాణం, తరగతి గదులు, లైబ్రరీ, ఆటస్థలాలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు మౌలిక సదుపాయాల ఏర్పాటును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని, పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న ఈ విద్యాసంస్థల్లో ప్రతి నిర్మాణం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ సామాగ్రి నాణ్యత, భవనాల భద్రతా ప్రమాణాలు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తరగతి గదుల రూపకల్పన వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అత్యాధునిక విద్యా వాతావరణంలో విద్యను అభ్యసించే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. పాఠశాలల పునఃప్రారంభ సమయానికి నిర్మాణ పనులు పూర్తికాకపోతే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, మిగిలిన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల ప్రారంభం నాటికి అన్ని తరగతి గదులు, లైబ్రరీ, ఆటస్థలాలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. నిర్మాణ పనుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశు భ్రమైన, సౌకర్యవంతమైన విద్యా వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రమేష్ కుమార్, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పురుగుల యాదయ్య, తహసిల్దార్ మురళి మోహన్, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






