ఇంట‌ర్ స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట బందోబస్తు

by Ratna Kumari |

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 21 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది.

ఇంట‌ర్ స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట బందోబస్తు
X

దిశ, గద్వాల క్రైం : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 21 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శక వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు

జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. పరీక్షా సమయాల్లో కేంద్రాల సమీపంలో గుంపులుగా తిరగడం నిషిద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిరాక్స్ సెంటర్లపై నిఘా

పరీక్షల సమయంలో అక్రమాలకు తావులేకుండా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఎస్పీ ఆదేశించారు. సంబంధిత పోలీస్ అధికారులు వీటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని, విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ప్రశ్నాపత్రాలకు ప్రత్యేక భద్రత

ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ల నుండి పరీక్షా కేంద్రాలకు చేరవేయడం, పరీక్ష ముగిసిన తర్వాత తిరిగి పోస్టాఫీసులకు తరలించే ప్రక్రియ వరకు ప్రత్యేక ఎస్కార్ట్ భద్రత కల్పించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఎగ్జామ్ సూపరింటెండెంట్లతో సమన్వయం చేసుకుంటూ, ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు అవకాశం లేకుండా విధులు నిర్వహించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలను పోలీస్ అధికారులు స్వయంగా సందర్శించి భద్రతను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.

Next Story