మే చివర లేదా జూన్ తొలివారంలో ఎన్నికల నగారా?

by velandi.Saikiran |

రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థలైన మండల పరిషత్ (ఎంపీపీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికల వైపు మళ్లింది.

elections
X

elections

పరోక్ష పద్ధతిలో ఎన్నికలు!?

ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు దిశగా సర్కార్ కసరత్తు

-సర్పంచుల ద్వారా ఎంపీపీ, ఎంపీపీల ద్వారా జెడ్పీ చైర్మన్ల ఎంపిక

-మే చివర లేదా జూన్ తొలివారంలో ఎన్నికల నగారా?

- ప్రొటోకాల్ రచ్చకు చెక్ పెట్టేలా సర్కార్ కసరత్తు

-పార్టీ ముఖ్య నేతలకు సూచనప్రాయంగా సమాచారం

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థలైన మండల పరిషత్ (ఎంపీపీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికల వైపు మళ్లింది. అధికార పార్టీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకున్న నేపథ్యంలో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దు...

ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ప్రత్యక్షంగాను ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరగడం గత కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాలు తదితర చోట్ల ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి. కొన్నిచోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీలకు ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయవలసిన పరిస్థితులు ఉండేవి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది

సర్పంచుల ద్వారా ఎంపీపీ, ఎంపీపీల ద్వారా జెడ్పీ చైర్మన్ల ఎంపిక..!?

గతంలో ప్రజలు నేరుగా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఎన్నుకునేవారు. ఈ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రతిపాదన ప్రకారం మండలంలోని సర్పంచులందరూ కలిసి తమలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకుంటారు. జిల్లాలోని ఎంపీపీలందరూ ఓటింగ్ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్లను ఎంపిక చేస్తారని సమాచారం. ఈ విధానం వల్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నిక కోసం అయ్యే వేల కోట్ల ఖర్చు ప్రభుత్వానికి మిగలడమే కాకుండా, ఎన్నికల ప్రక్రియ కూడా వేగంగా పూర్తవుతుందని సర్కార్ భావిస్తోంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 74 ఎంపీపీ స్థానాలు, 5 జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపికలు ఉంటాయి. మండల యూనిట్ గా సర్పంచులు అందరూ ఎంపీపీని ఎన్నుకుంటే.. జిల్లాలో ఉన్న ఎంపీపీలు అందరూ కలిసి ఒకరిని జడ్పీ చైర్మన్ గా ఎన్నుకునే విధంగా అధికారులు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మే చివర.. లేదా జూన్ మొదటి వారంలో ఎన్నికలు..!?

సర్పంచి, మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుపొందడంతో.. ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలను సైతం ప్రభుత్వం వెంటనే నిర్వహించవచ్చు అని ఆశించారు. కానీ విద్యార్థులకు పరీక్షలు, వేసవి తీవ్రతలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఈ ఎన్నికలను మే చివరి వారంలో గాని, జూన్ మొదటి వారంలో గాని నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగానే ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు.

త్వరలోనే స్పష్టత...

ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ల ఎంపిక అంశంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎప్పటిలాగే ఎంపీటీసీ, జడ్పిటిసిల ఎన్నికలను నిర్వహించి వారి ద్వారా పరోక్షంగా ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ల ఎంపికను నిర్వహిస్తారా లేదా ఇతర మార్గాలను అన్వేషిస్తారా అన్న అంశాలు ఆశావాహులలో ఆసక్తిని రేపుతున్నాయి.

Next Story