- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాల నడిబొడ్డున 'కబ్జా'!
గద్వాలలోని ప్రధాన వ్యాపార కూడలి, పాత బస్టాండ్ ప్రాంతం ప్రస్తుతం అక్రమార్కుల కబంధహస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది.

గద్వాల నడిబొడ్డున 'కబ్జా'!
=పాత బస్టాండ్ కూడలిలో మాఫియా రాజ్యం!
=మున్సిపల్ షాపుల్లో బడా నేతల 'కిరాయి' దందా..
=లక్షల్లో జేబులు నింపుకుంటున్న అక్రమార్కులు
దిశ,గద్వాల క్రైమ్ : జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడలి, పాత బస్టాండ్ ప్రాంతం ప్రస్తుతం అక్రమార్కుల కబంధహస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. పట్టణానికి గుండెకాయ వంటి ఈ ప్రాంతం, క్రమంగా కబ్జాదారుల అడ్డాగా మారుతోంది. రాఘవేంద్ర షాప్ రోడ్డు నుండి మొదలై రథశాల, పాత బస్టాండ్ మీదుగా బాలికల ఉన్నత పాఠశాల వరకు ప్రధాన రహదారి మొత్తం ఆక్రమణలకు గురై, వాహనదారులు , పాదచారులు నిత్యం ప్రమాదాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల అండదండలతో సామాన్యుడికి రోడ్డుపై నడవడం గగనంగా మారింది.
ప్రమాదభరితంగా ఫుట్‌పాత్ వ్యాపారం పాదచారుల ప్రాణాలు గాలిలో!
ఈ కూడలిలో అసలు ఫుట్‌పాత్‌లు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాదచారుల కోసం కేటాయించిన స్థలాన్ని వ్యాపారులు పూర్తిగా ఆక్రమించేశారు. ఫుట్‌పాత్‌లపైనే గ్యాస్ స్టౌవ్‌లు పెట్టి వంటలు చేయడం, వేడి వేడి నూనె బాణలు రోడ్డుకు ఆనుకునే ఉంచడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని జనం వణికిపోతున్నారు. ఫుట్‌పాత్‌లు లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ప్రాణాలకు తెగించి ప్రధాన రహదారిపై నడవాల్సి వస్తోంది. తోపుడు బండ్లు, పండ్ల షాపుల తాకిడికి రోడ్డు కుంచించుకుపోవడంతో వాహనాలు ఢీకొని నిత్యం ఘర్షణలు, చిన్నపాటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల భద్రతను పణంగా పెట్టి సాగుతున్న ఈ వ్యాపార సామ్రాజ్యంపై చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యారు.
మూడు పూటలా.. మూడు రకాల అరాచకం!
ఈ కూడలిలో ఆక్రమణలు గంట గంటకూ రంగు మారుస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని తలపిస్తున్నాయి. తెల్లవారుజాము నుండే రోడ్డును ఆక్రమించి టిఫిన్ సెంటర్లు వెలుస్తుండగా, మధ్యాహ్నం అయ్యేసరికి కూల్ డ్రింక్స్, తోపుడు బండ్లు, పండ్ల షాపులు తిష్ట వేస్తున్నాయి. ఇక సాయంత్రం వేళల్లో బజ్జీల సెంటర్ల,తోపుడు బండ్ల పండ్ల షాపుల ధాటికి రోడ్డు మొత్తం క్లోజ్ అవుతోంది. ఆర్టీసీ బస్సులు సైతం లోపలికి రావడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అటు మున్సిపల్ అధికారులు గానీ, ఇటు ట్రాఫిక్ పోలీసులు గానీ ఈ అస్తవ్యస్త పరిస్థితిని చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటో ప్రజలకు అర్థం కావడం లేదు.
నాయకుల గుప్పిట్లో ప్రభుత్వ ఆస్తులు.. లక్షల్లో వసూళ్లు!
గతంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణం ముందు నిరుపేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కొన్ని షాపులను నిర్మించారు. అయితే, ఆ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. ప్రస్తుతం ఆ షాపులన్నీ స్థానిక రాజకీయ నాయకుల కబ్జాలో ఉన్నాయి. అర్హులైన నిరుపేదలకు కాకుండా, కొందరు 'బడా' నాయకులు ఈ షాపులను తమ ఆధీనంలో ఉంచుకుని, ఇతరులకు నెలకు వేల రూపాయల కిరాయిలకు ఇస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాన్ని, ప్రభుత్వ నిర్మాణాలను వాడుకుంటూ వ్యక్తిగతంగా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నా, మున్సిపల్ యంత్రాంగం మౌనంగా ఉండటంతో మున్సిపాలిటీ ఖజానాకు భారీగా గండి పడుతోంది.
కొత్త పాలక వర్గానికి ఇదే అగ్నిపరీక్ష!
ఎన్నికల సమయంలో పట్టణాన్ని సుందరీకరిస్తామని, ఆక్రమణలు తొలగిస్తామని హామీలు ఇచ్చి గెలిచిన కొత్త పాలక వర్గం ముందు ఇప్పుడు ఈ సమస్య పెద్ద సవాల్‌గా నిలిచింది. కబ్జా కోరల్లో చిక్కుకున్న మున్సిపల్ షాపులను స్వాధీనం చేసుకుంటారా? ప్రమాదకరంగా మారిన ఫుట్‌పాత్ వ్యాపారాలను క్రమబద్ధీకరించి ప్రజలకు ఊపిరి పోస్తారా? అని పట్టణ ప్రజలు వేచి చూస్తున్నారు. అధికారులు స్పందించి ఉక్కుపాదం మోపకపోతే గద్వాల పట్టణం అక్రమార్కుల అడ్డాగా మిగిలిపోవడం ఖాయం.






