‘రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ దగా!..యూరియా ఇవ్వకుండా !

by velandi.Saikiran |   (  Updated:2026-03-10 22:00:43  IST  )

అమ్రాబాద్ మండలంలో ఆన్‌లైన్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు ఎఫ్‌పీసీఎల్ సంస్థ చుక్కలు చూపిస్తోంది.

‘రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ దగా!..యూరియా ఇవ్వకుండా !
X

‘రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ దగా!

ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న యూరియా ఇవ్వని ఎఫ్‌పీసీఎల్ సంస్థ

రూ.1100 చెల్లించి సభ్యత్వం ఉంటేనే ఎరువులు ఇస్తామంటూ హుకుం

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి బస్తాకు రూ.300 వసూలు

8 బస్తాలు బుక్ చేసుకుంటే 2 బస్తాలే ఇచ్చి చేతులు దులుపుకుంటున్న నిర్వాహకులు

ప్రశ్నించిన రైతులపై, మీడియా ప్రతినిధులపై ఇన్చార్జి రమణి ఎదురుదాడి

నిబంధనల ప్రకారం ఇవ్వకపోయినా పట్టించుకోని వ్యవసాయ అధికారులు

యూరియా కోసం అవస్థలు పడుతున్న అమ్రాబాద్ మండల రైతాంగం ఆవేదన

అమ్రాబాద్ మండలంలో ఆన్‌లైన్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు ఎఫ్‌పీసీఎల్ సంస్థ చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన బస్తాలను ఇవ్వకుండా, రైతులపై సదరు సంస్థ నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారు. సంస్థలో రూ.1100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటేనే యూరియా ఇస్తామంటూ వింత నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధనంగా ప్రతి బస్తాకు రూ.30 చొప్పున మొత్తం రూ.300 వసూలు చేస్తున్నారు. 8 బస్తాలు బుక్ చేసుకున్న రైతులకు కేవలం 2 బస్తాలే ఇచ్చి, మిగిలినవి అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాలపై వివరణ కోరిన మీడియా ప్రతినిధులపై సంస్థ ఇన్చార్జి రమణి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఎదురుదాడికి దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, రైతులను దోచుకుంటున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, అచ్చంపేట : రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఎఫ్పీసీఎల్) వారిని నిలువునా దోచుకుంటోంది. ప్రభుత్వం సూచించిన ఆన్‌లైన్ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గతంలో పీఏసీఎస్ (PACS)లో అక్రమాలు జరగడంతో ఈ ఎన్జీవో సంస్థకు ఎరువుల పంపిణీ బాధ్యత అప్పగించగా, వీరు అంతకు మించి అక్రమాలకు తెరలేపారు.

అదనపు వసూళ్ల పర్వం..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీబరు చార్జీలతో కలిపి యూరియా బస్తా ధర రూ. 270 ఉండాలి. కానీ, ఈ సంస్థ నిర్వాహకులు ప్రతి బస్తాకు అదనంగా రూ. 30 వసూలు చేస్తూ మొత్తం రూ. 300 గుంజుతున్నారు. అంతేకాకుండా, సదరు సంస్థ గోదాములో కాలం చెల్లిన మందులను నిల్వ ఉంచడం గమనార్హం.

సభ్యత్వం ఉంటేనే యూరియా!

ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు యూరియా అందించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం వింత నిబంధనలు అమలు చేస్తున్నారు. తమ ఎన్జీవో సంస్థలో రూ. 1100 చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికే యూరియా ఇస్తామని, లేదంటే 'దిక్కున్న చోట చెప్పుకో' అని రైతులను బెదిరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో 8 బస్తాలు బుక్ చేసుకున్న రైతులకు కేవలం 2 లేదా 3 బస్తాలు మాత్రమే ఇచ్చి, మిగిలినవి పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అకౌంటెంట్ కూడా బుకింగ్‌లు రద్దు చేస్తానంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.

మీడియాపై ఎదురుదాడి..

రైతుల ఫిర్యాదు మేరకు 'దిశ' ప్రతినిధి సంస్థ సీఈవో రమణిని వివరణ కోరగా, ఆమె నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అధిక ధరల వసూలుపై ప్రశ్నిస్తే.. అది డైరెక్టర్ల నిర్ణయమని, తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ బుకింగ్ ప్రకారం బస్తాలు ఎందుకు ఇవ్వడం లేదని అడగగా, ఎదురుదాడికి దిగడం గమనార్హం.

ఏఓ రమేష్ రెడ్డి వివరణ...

ఈ వ్యవహారంపై ఏఓ రమేష్ రెడ్డిని వివరణ కోరగా.. ఫర్టిలైజర్ యజమానులు ముందుకు రాకపోవడంతో ఎన్జీవో సంస్థ ముందస్తుగా కొనుగోలు చేస్తోందని, వారికి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు ఉంటాయని సమర్థించడం విశేషం. అయితే, బుక్ చేసుకున్న రైతులకు నిబంధనల ప్రకారం యూరియా ఇవ్వాలని, సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు.

Next Story