కుమ్మెర ఘటనలో వీడని మిస్టరీ..మాయమైన బాధిత కుటుంబం!

by velandi.Saikiran |   (  Updated:2026-02-26 22:46:11  IST  )

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన ఘర్షణ, పసిపాప మరణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది.

కుమ్మెర ఘటనలో వీడని మిస్టరీ..మాయమైన బాధిత కుటుంబం!
X

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన ఘర్షణ, పసిపాప మరణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. దర్శనం టిక్కెట్టు వివాదంలో అగ్రవర్ణాల వారు జరిపిన దాడిలో రెండు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం విషాదకరంగా మారింది. ఈ ఘటనపై బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వంటి రాజకీయ పార్టీలు, ధర్మ సమాజ్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. బాధితురాలి కులం విషయంలో పోలీసులు చేసిన ప్రకటన ఈ వివాదానికి కొత్త మలుపునివ్వడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నిందితుల అరెస్టులో పోలీసులు జాప్యం చేస్తున్నారన్న విమర్శల నడుమ ధర్నా స్థలం నుంచి బాధిత కుటుంబం మాయం కావడం కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులను ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తీసుకెళ్లారని పోలీసులు చెబుతుండగా, అసలు నిజాలు దాయాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో బాధ్యులకు శిక్ష పడుతుందా? లేక రాజకీయాల మధ్య ఈ ఘటన మరుగున పడుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. దైవ దర్శనం కోసం నిర్ణయించిన రూ.100 టిక్కెట్టు విషయంలో జాతర పెద్దలకు, స్థానిక మహిళలకు మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ ఘర్షణలో ఓ కుటుంబంపై దారుణంగా దాడి జరగడం, అదే సమయంలో రెండు నెలల పసిపాప అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

వివాదం చుట్టూ రాజకీయ రంగు...

ఈ ఘటన వెలుగులోకి రాగానే రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేశాయి. బాధిత కుటుంబానికి అండగా బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వంటి ప్రధాన పార్టీలతో పాటు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు నిలిచారు. పసిపాప మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు రిలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. బాధ్యులపై కేసులు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కుల ప్రస్తావన.. పోలీసుల దర్యాప్తు..

బాధిత మహిళ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినదని భావించి అనేక సంఘాలు మద్దతుగా నిలిచాయి. అయితే, విచారణలో భాగంగా సదరు మహిళ ఎస్సీ కాదని, బీసీ-ఏ వర్గానికి చెందినదని పోలీసులు ప్రకటించడం కొత్త వివాదానికి దారితీసింది. కులం ఏదైనప్పటికీ జరిగిన దారుణానికి న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు, ఈ నెల 18న ఘటన జరిగితే నిందితులను రిమాండ్‌కు పంపడంలో ఆలస్యం చేయడం పోలీసుల తీరుపై అనుమానాలను పెంచుతోంది. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అదృశ్యమైన కుటుంబం.. కొనసాగుతున్న ఉత్కంఠ..

గురువారం ఉదయం ఆందోళన చేస్తున్న టెంటు ఒక్కసారిగా ఖాళీ కావడంతోపాటు బాధిత కుటుంబ సభ్యులు కనిపించకపోవడం కలకలం రేపింది. ధర్మ సమాజ్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల సూచన మేరకు వారు హైదరాబాద్‌కు తరలి వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. బాధితులు అకస్మాత్తుగా మాయం కావడం వెనుక ఉన్న అసలు కారణాలేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలను నిష్పక్షపాతంగా బయటకు తీసి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం త్వరితగతిన న్యాయం చేయాలని స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story