ఎరగుట్టను చెరబట్టారు..! అక్రమంగా మట్టిని తవ్వేస్తున్న మట్టి మాఫియా

by Ramesh Naini |   (  Updated:2026-01-17 02:52:29  IST  )

మట్టి మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోతుంది. ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు చెప్పి పట్టపగలే ప్రభుత్వ భూముల నుంచి మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు.

ఎరగుట్టను చెరబట్టారు..! అక్రమంగా మట్టిని తవ్వేస్తున్న మట్టి మాఫియా
X

దిశ, షాద్‌నగర్ : మట్టి మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోతుంది. ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు చెప్పి పట్టపగలే ప్రభుత్వ భూముల నుంచి మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇదేంటి అని అడిగిన వారికి నయానో, బయానో ఇచ్చి.. మట్టిని తరలించేందుకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ దబాయింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.

రాత్రి, పగలు తేడా లేకుండా తరలింపు..

షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేముల నర్వ గ్రామ పంచాయతీ పరిధిలో ఎరగుట్ట ఉంది. ఈ గుట్టను తవ్వి మట్టి మాఫియా షాద్ నగర్, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ పట్టణానికి సైతం రాత్రి. పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లలో రహదారులు వేసేందుకు ఒక ట్రిప్పుకు రూ.1500 నుంచి రూ. 2000 వరకు మట్టి మాఫియా వసూలు చేస్తుంది. అక్రమంగా ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తరలించవద్దని గ్రామస్తులు ఆ మాఫియా దృష్టికి తీసుకువస్తే.. ప్రభుత్వ అధికారులు తమకు అనుమతులు ఇచ్చారంటూ, ఈ విషయంలో కలగజేసుకుంటే కథ మరోలా ఉంటుందంటూ దబాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరికొంత మందికి మట్టి మాఫియా నయానో, బయానో ఇచ్చి నోరు ముయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదులు చేసినా నో రెస్పాన్స్..

ఎరగడ్డ నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని, వారి ఆగడాలను అడ్డుకోవాలని స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేశంపేట మండలంలో మట్టి మాఫియా ఆగడాలను అధికారులు అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని వేములనర్వ గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

Next Story