- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 14, 15వ వార్డుల్లో అధికార, ప్రతిపక్షం నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

దిశ, కందనూల్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 14, 15వ వార్డుల్లో అధికార, ప్రతిపక్షం నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కలుగజేసుకుని అందరిని అక్కడి నుంచి పంపించి వేసి, వివాదాన్ని సద్దుమణిగించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో తిరిగి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 14 వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు నాయకులూ రావడంతో చాలా మంది గుమిగూడుతున్నారని, ఎక్కువమంది ఉంటె గొడవలయ్యే అవకాశముంటుందని, పోలింగ్ పరిసరాల్లో ఉండొద్దని వచ్చి అరగంటకుపైగా కావస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని, అక్కడున్న సీఐ అశోక్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డిని కోరారు. దీంతో ఇక్కడుంటే ఏమైందంటూ మర్రి ప్రశ్నించారు.
తాను గొడవలు చేయడానికి రాలేదని, తనకు అంతా తెలుసనీ గొడవలైతే కంట్రోల్ చేస్తానని చెప్పారు. సీఐ పోలీసులను పురమాయించి మిగతా కార్య కర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో బలవంతంగా ఎట్లా పంపిస్తారంటూ మర్రి ప్రశ్నించడంతో సీఐ, మర్రి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లేదు వెళ్లపోవాలంటూ సీఐ కరాఖండిగా సూచించారు. పోకపోతే ఏమి చేస్తారు..? కొడతావా..? కొట్టు. కేసు పెడతావా అంటూ మర్రి సీఐని నిలదీశారు. దీంతో తానెందుకు కొడతానని వెళ్లిపోవాలని మాత్రమే చెబుతున్నానని సీఐ సమాధానమిచ్చారు. దీంతో మర్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు 15వ వార్డులో పోలింగ్ బూత్ వద్ద ఒక మహిళ ఓటు వేయడానికి వచ్చి వివరాలు చూసుకుంటుండగా అది దొంగ ఓటని, వయసు సరిపోవడంలేదని, ఆ ఓటు వేయించడానికి మీరంటే మీరు తీసుకు వచ్చారంటూ ఇరు పార్టీల నాయకులు ఆక్షేపించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే క్రమంలో అక్కడకు వెళ్ళిన మర్రి జనార్ధన్ రెడ్డి అధికార పార్టీల నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించగా వివాదం మరింత పెరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇది గమనించిన పోలీసులు అక్కడి నుంచి ఇరు వర్గాలను బయటికి పంపించారు. ఈ రెండు పోలింగ్ కేంద్రాల వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నివారించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఈ క్రమంలో కోపోద్రుక్తులైన మర్రి జనార్ధన్ రెడ్డి అధికారం అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారని, ఒక్కోక్కరి సంగతి చూసుకుంటా, బట్టలూడదీసి కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ అక్కడనుంచి వెళ్లిపోయారు.






