సీడ్ పత్తి రైతుల ధర్నా.. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన

by Chintha Aamani |

నడిగడ్డ లో సుమారు 20 కంపెనీ లకు పైగా సీడ్ పత్తి కంపెనీలు పత్తి సీడ్ ఉత్పత్తి కోసం రైతులకు ప్రోత్సహించారు.

సీడ్ పత్తి రైతుల ధర్నా.. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన
X

దిశ, జోగులాంబ గద్వాల ప్రతినిధి : నడిగడ్డ లో సుమారు 20 కంపెనీ లకు పైగా సీడ్ పత్తి కంపెనీలు పత్తి సీడ్ ఉత్పత్తి కోసం రైతులకు ప్రోత్సహించారు. పంట వేసిన తర్వాత ప్రస్తుతం సీడ్ కంపెనీ చేతులెత్తేసి కేవలం ఎకరాకు రెండు క్వింటాల పత్తి విత్తనాలే కొంటామని చెప్పడం రైతులను మోసం చేయడమే అని నాయకులు తెలిపారు. గురువారం సీడ్ కంపెనీ లకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం ముందు పత్తి సీడ్ పండించే రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి, బీజేపీ, సీపీఎం, బీఆర్ఎస్, పాలమూరు అధ్యయన వేదిక సంఘాలు మద్దతు ఇచ్చి రైతులకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ధర్నా ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా నడిగడ్డ లో పత్తి సీడ్ ఉత్పత్తి కి అనేక కంపెనీలు పత్తి సీడ్ ఇచ్చి సీడ్ ఉత్పత్తి చేసేవారని అనేక సంవత్సరాలు గా కంపెనీ లు రైతుల కష్టాన్ని దోచుకొన్నాయని విమర్శించారు. సీడ్ పండించే రైతులు మాత్రం లాభపడలేదు కానీ సీడ్ కంపెనీ లు, సీడ్ ఆర్గనైజర్ లు లాభపడ్డారని విమర్శించారు. ఈ సంవత్సరం పత్తి సీడ్ పండించే రైతుల వద్ద కేవలం 2 క్వింటల్లా పత్తి గింజలను కంపెనీలు కొంటామని చెప్పడం రైతులను మోసం చేయడమే అని అన్నారు. జిల్లా కలెక్టర్ రైతులు, సీడ్ కంపెనీ ల మధ్య సీడ్ పంట కొనుగోలు ఒప్పందం చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రైతులు ఇప్పటికే రెండు నెలలు పత్తి పంట వేశారని మధ్యలో కంపెనీ లు పంట కొనుగోలు చేయము అంటే రైతులు ఉరి వేసుకుని పరిస్థితి వస్తుందని తెలిపారు. బేషరతుగా కంపెనీ లు రైతులు పండించిన సీడ్ పంట మొత్తం కంపెనీలు యధావిధిగా కొనుగోలు చేయాలని లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్, బుచ్చి బాబు, బీజేపీ నాయకులు రామాంజనేయులు, రజక జయశ్రీ, బీ ఆర్ ఎస్ నాయకుడు నాగర్ దొడ్డి వెంకట్రాములు, కుర్వ పల్లయ్య, పాలమూర్ అధ్యయన వేదిక ఇక్బాల్, సీఐటీయూ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Next Story