సంచలనం: ఎన్నికల ఖర్చు కోసం ‘పేదల ప్లాట్లకు బేరం

by Malleboina Mahesh |

అచ్చంపేట మండలం అక్కారంలో సర్పంచ్ ఎన్నికల ఖర్చు కోసం పేదల ప్లాట్లకు బేరం?.. క్రీడా ప్రాంగణాన్ని ధ్వంసం చేసి ప్లాట్లుగా మార్చడంపై గ్రామస్తుల ఆగ్రహం!

సంచలనం: ఎన్నికల ఖర్చు కోసం ‘పేదల ప్లాట్లకు బేరం
X

దిశ, అచ్చంపేట: పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి, చివరకు సర్పంచ్ ఎన్నికల ఖర్చులను పూడ్చుకునే వనరుగా మారిందనే ఆరోపణలు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అక్కారం గ్రామంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సుమారు 15 ఏళ్ల క్రితం నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ శాఖ కేటాయించిన సర్వే నెంబర్ 102 లోని రెండెకరాల భూమిలో ప్రస్తుత సర్పంచ్ కొర్ర లాలు అక్రమంగా ప్లాట్లు చేసి, ఒక్కొక్కరి వద్ద రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. బుధవారం ఈ విషయమై గ్రామ ప్రజలు సర్పంచ్‌ను నిలదీయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు ఎలా తీర్చాలి

మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తాను పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సదరు భూమిని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా రేటు ఫిక్స్ చేసి ప్లాట్లను కేటాయిస్తున్నట్లు సర్పంచ్ అంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పై రెండెకరాల భూమిలోని కొంత భాగంలో నిబంధనల ప్రకారం గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ప్రస్తుత సర్పంచ్ గ్రామ పంచాయతీలో ఎలాంటి తీర్మానం చేయకుండానే రాత్రికి రాత్రే జేసీబీలతో క్రీడా ప్రాంగణాన్ని పూర్తిగా తొలగించి ప్లాట్లుగా మార్చడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కార్యదర్శి లేరని..

గ్రామానికి గత రెండు నెలలుగా పంచాయతీ కార్యదర్శి లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని రెవెన్యూ, ఎంపీడీవో అధికారుల కనీస ఆదేశాలు, అనుమతులు లేకుండానే ఏకపక్షంగా ప్లాట్ల నిర్మాణం చేపట్టడం వెనుక పెద్ద ఎత్తున సొమ్ము చేసుకునే ప్రయత్నం జరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి సాయిరాంను ఫోన్ ద్వారా వివరణ కోరగా, క్రీడా ప్రాంగణంలో ఇళ్ల నిర్మాణం కోసం ఎలాంటి తీర్మానం జరగలేదని స్పష్టం చేయడం గమనార్హం.

ఆరోపణల్లో వాస్తవం లేదు

ఈ వ్యవహారంపై సర్పంచ్ లాలూను వివరణ కోరగా, తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. గ్రామంలోని 102 సర్వే నెంబర్ భూమిలో 36 ప్లాట్లు చేసిన మాట వాస్తవమేనని, గ్రామంలో ఇల్లు లేని వారు దాదాపు 70 మంది ఉన్నట్లు గ్రామస్తుల సమక్షంలోనే గుర్తించామని చెప్పారు. కొందరు కావాలనే తమపై రాజకీయ కక్షతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.:- సర్పంచ్ కొర్ర లాలు

Next Story