- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుందుభి నదిలో ఇసుక దందా
రాజాపూర్ మండలంలోని పలు గ్రామాలు ఇసుక మాఫియాకు అడ్డగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాజాపూర్ మండలంలోని పలు గ్రామాలు ఇసుక మాఫియాకు అడ్డగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల మౌనం, రాజకీయ నేతల అండదండలతో దుందుభి నదీ గర్భం నుండి రాత్రింబవళ్లు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఈ దందా వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, భూగర్భ జలాలు అట్టడుగుకు చేరి వేసవిలో నీటి కొరత ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారులు ధ్వంసమవుతున్నా యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులే మాఫియాకు సహకరిస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు.
దిశ, రాజాపూర్ : రాజాపూర్ మండలంలోని రాజాపూర్, మల్లేపల్లి, రాయపల్లి, చెన్నవెళ్లి, తిరుమలాపూర్, నందిగామ గ్రామాలు ప్రస్తుతం ఇసుక మాఫియాకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎటువంటి నిర్బంధాలు లేకుండా అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి అయితే చాలు దుందుభి నదీ గర్భం నుంచి ఇసుక తరలించడానికి టిప్పర్లు, ట్రాక్టర్లు, జేసీబీలు వరుస కడుతున్నాయి. ప్రజలు నిద్రపోయే వేళ ఇసుక మాఫియా పండుగ చేసుకుంటోంది. అయితే, ఈ అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ, అధికారిక అండదండలు?
ఈ ఇసుక మాఫియా వెనుక అధికారుల రక్షణ ఉందా? లేక రాజకీయ నేతల ఆశీస్సులు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధుల మౌనం వెనుక అసలు కారణం ఏంటని, నెలనెలా వాటాలు అందుతున్నాయన్న ప్రచారంలో నిజమెంత అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎక్కడా తనిఖీలు లేకపోవడం, కేసులు నమోదు కాకపోవడంతో అక్రమ రవాణాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోని యంత్రాంగం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు...
ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. నదీ గర్భం నుంచి ఇసుకను భారీగా తరలిస్తుండడంతో వేసవికాలంలో భూగర్భ జలాలు అట్టడుగుకు చేరి తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వాహనాల రాకపోకల వల్ల రహదారులు కూడా ధ్వంసమవుతున్నాయి. అయినా అధికారుల్లో చలనం లేకపోవడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందా లేక వ్యవస్థాగత అవినీతి ఉందా అని ప్రజలు మండిపడుతున్నారు.
బహిరంగంగానే దందా...
ఇక ఈ దందా రాత్రి వేళలకే పరిమితం కాకుండా, పగలు కూడా నిర్భయంగా సాగుతోంది. దుందుభి నది లోపలి నుంచి ఇసుకను తోడుతున్న దృశ్యాలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఇంత విచ్చలవిడిగా అక్రమ రవాణా సాగుతున్నా పైస్థాయి అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం మోపుతారో లేదో వేచి చూడాలి.






