రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. కోట్లకు పడగలెత్తుతున్న బకాసురులు

by Naga Rani Yarlagadda |

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. కోట్లకు పడగలెత్తుతున్న బకాసురులు
X

దిశ, జోగులాంబ గద్వాల ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాయలసీమ ప్రాంతం నుంచి జిల్లాకు అక్రమంగా ఇసుకను తరలిస్తూ కొందరు 'బకాసురులు' కోట్లకు పడగలెత్తుతున్నారు. సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ సాగుతున్న ఈ దందాలో అటు రాజకీయ నాయకులు, ఇటు కొందరు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమ రవాణా సాగుతోందిలా..

రాయలసీమలోని గోనెగండ్ల, పంచలింగాల ప్రాంతాల నుంచి ఇసుకను లోడ్ చేసుకుని కర్ణాటకలోని ఎరిగేరా, బలిగేరా మీదుగా ఒక మార్గం ద్వారా, అలాగే నందికొట్కూరు నుంచి అలంపూర్ మీదుగా మరో మార్గం ద్వారా ప్రతిరోజూ పదుల సంఖ్యలో లారీలు గద్వాల జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.

ధర వింటే గుండె గుభేల్!

సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఇసుకను రాయలసీమ మాఫియా చేజిక్కించుకుని చుక్కలు చూపిస్తోంది. ఒక్కో లారీ ఇసుకను సుమారు 35 వేల నుంచి 40 వేల రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గద్వాల కేంద్రంగా అడ్డా ఏర్పాటు చేసుకుని, గట్టు మండలంలో రహస్యంగా డంపులు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల గట్టు మండలంలోని అధికారులు కొన్ని డంపులను సీజ్ చేసినప్పటికీ మాఫియా తీరులో మార్పు రాలేదు. అలాగే సోమవారం అయిజ మండలం పులికల్ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను పోలీసులు సీజ్ చేశారు.

అధికారుల తీరుపై అనుమానాలు?

ప్రతిరోజూ కళ్ల ముందే లారీలు తిరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్,పోలీస్ యంత్రాంగం కేవలం తూతూ మంత్రంగా చర్యలకే పరిమితమవుతుండటం గమనార్హం. వారంరోజుల క్రితం గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక లారీపై కేసు నమోదు చేశారు. అలాగే ఆదివారం రాత్రి ఇటిక్యాల పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో లారీని పట్టుకున్నప్పటికీ.. కంటితుడుపు చర్యలే తీసుకున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పట్టుబడిన వాహనాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను వదిలేసి నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాజకీయ అండ.. రిపోర్టర్ల పాత్ర?

ఈ అక్రమ వ్యాపారం వెనుక స్థానిక రాజకీయ నాయకుల హస్తం బలంగా ఉన్నట్లు సమాచారం. దానికి తోడు, నిఘా ఉంచాల్సిన ఒకరిద్దరు రిపోర్టర్లు కూడా ఈ మాఫియాతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ పలుకుబడి, క్షేత్రస్థాయిలో కొంతమంది సహకారం ఉండటంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, గద్వాల జిల్లాను అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచి అక్రమ ఇసుక మాఫియా నడ్డి విరవాలని ప్రజలు కోరుతున్నారు.

37 కేసులు.. 39 వాహనాల సీజ్: ఎస్పీ టి. శ్రీనివాసరావు

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. గత మూడు నెలల కాలంలోనే 37 కేసులు నమోదు చేసి, 39 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని, చెక్ పోస్టుల వద్ద నిఘా మరింత కఠినతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Next Story