పురపాలిక ఎన్నికల రిజర్వేషన్లను పకడ్బందీగా ఖరారు చేయాలి : కలెక్టర్ బీఎం సంతోష్

by Nallavelli.Anjaneyulu |

పురపాలిక ఎన్నికల నిర్వహణకు ఆయా వర్గాల జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లను పకడ్బందీగా ఖరారు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

పురపాలిక ఎన్నికల రిజర్వేషన్లను పకడ్బందీగా ఖరారు చేయాలి : కలెక్టర్ బీఎం సంతోష్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : పురపాలిక ఎన్నికల నిర్వహణకు ఆయా వర్గాల జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లను పకడ్బందీగా ఖరారు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పురపాలిక ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ, బీసీ, తదితర వర్గాల ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు. శనివారం ఉదయం 11గంటలకు ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా మహిళ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఇతర ప్రక్రియ మొత్తం నిర్దేశిత సమయంలోగా పూర్తి కావాలన్నారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్, ప్రిసైడింగ్, ఇతర అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది అదే మున్సిపాలిటీకి సంబంధించిన వారు కాకుండా ఇతర మండలాల వారిని తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు విధులు నిర్వర్తించే ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు జానకి రామ్ సాగర్, శంకర్ నాయక్, సైదులు, రాజయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story