- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుగుబాటు సెగలు.. నేటి నుంచి బుజ్జగింపుల పర్వం..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ నగారా మోగింది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ నగారా మోగింది. మున్సిపల్ కార్పొరేషన్ సహా 18 మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీగా తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో భారీ ర్యాలీలు, శక్తి ప్రదర్శనలతో నామినేషన్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయాల పరిసరాలు జై జై ధ్వానాలతో హోరెత్తాయి.
నేడే స్క్రూటినీ.. అభ్యర్థుల్లో ఉత్కంఠ!
నామినేషన్ల పర్వం ముగియడంతో శనివారం అధికారులు పత్రాల పరిశీలన (స్క్రూటినీ) చేపట్టనున్నారు. సాంకేతిక లోపాలు, అసంపూర్తి సమాచారం ఉంటే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. సాయంత్రం లోపు సక్రమంగా ఉన్న నామినేషన్ల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో అసలు సిసలు రాజకీయం మొదలుకానుంది.
రెబల్స్ టెన్షన్.. అధిష్టానం యాక్షన్!
టికెట్ ఆశించి భంగపడ్డ వారు దాదాపు అన్ని వార్డుల్లోనూ స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. ఒక్కో వార్డులో సగటున 10 నుంచి 20 మంది పోటీ పడుతుండటంతో ప్రధాన పార్టీలకు రెబల్స్ భయం పట్టుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో శనివారం నుంచే బుజ్జగింపుల పర్వం మొదలు కానుంది. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు స్వయంగా రంగంలోకి దిగి రెబల్స్‌ను శాంతింపజేసేందుకు పదవుల ఆశ చూపిస్తున్నారు.
జిల్లాల వారీగా నామినేషన్ల వివరాలు : మున్సిపాలిటీలు... వార్డులు.. దాఖలైన నామినేషన్ల సంఖ్య.
వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లాలో మొత్తం 80 వార్డులకు 812 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అమరచింత మున్సిపాలిటీకి సంబంధించి పది వార్డులకు 97, ఆత్మకూరు 10 వార్డులకు 103, కొత్తకోట 15 వార్డులకు 123, పెబ్బేరు 12 వార్డులకు 104, వనపర్తి 33 వార్డులకు గాను 385 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నాగర్ కర్నూల్ జిల్లా :
నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 65 వార్డులకు గాను 521 నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు 224, కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు 152, కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులకు 145 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
జోగులాంబ గద్వాల జిల్లా:
అలంపూర్ మున్సిపాలిటీ పది వార్డులకు గాను 59 నామినేషన్లు, గద్వాల 37 వార్డులకు 306 నామినేషన్లు, ఐజ లో ఉన్న 20 వార్డులకు 103, వడ్డేపల్లి మునిసిపాలిటీలో ఉన్న పది వార్డులకు 57 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
మహబూబ్ నగర్ జిల్లా :
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఉన్న 60 డివిజన్లకు మొత్తం 781 నామినేషన్లు దాఖలు చేశారు. భూత్పూర్ లో 10 వార్డులకు 96, దేవరకద్ర మునిసిపాలిటీ లో ఉన్న 12 వార్డులకు 96 నామినేషన్లు వచ్చాయి.
నారాయణపేట జిల్లా :
మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 131 నామినేషన్లు, మద్దూరు మున్సిపాలిటీ 16 వార్డులకు 89, నారాయణపేట 24 వార్డులకు 202నామినేషన్లు దాఖలు అయ్యాయి. కోస్గి మున్సిపాలిటీలోని 16 వార్డులకు సంబంధించి నామినేషన్ల వివరాలు శుక్రవారం అర్ధరాత్రి దాటేవరకు అందలేదు.






