- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్ళీ జిల్లాల పునర్విభజన?..
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అస్తవ్యస్త విభజన వల్ల ఒకే నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లడంతో అటు పాలనాపరంగా, ఇటు రాజకీయంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఒకే నియోజకవర్గం-ఒకే జిల్లా' ఫార్ములాను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముక్కలైన నియోజకవర్గాలు..
గత విభజనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఐదు జిల్లాలుగా విడగొట్టారు. అయితే, శాస్త్రీయత లోపించడంతో పలు నియోజకవర్గాలు ముక్కలయ్యాయి.
దేవరకద్ర: ఈ నియోజకవర్గంలోని ఆరు మండలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే, రెండు మండలాలు వనపర్తి జిల్లాలో ఉన్నాయి.
కొడంగల్: నియోజకవర్గంలోని 8 మండలాల్లో 4 నారాయణపేటలో, మరో 4 వికారాబాద్ జిల్లాలో కలిసిపోయాయి.
మక్తల్: ఇక్కడ నాలుగు మండలాలు నారాయణపేటలో ఉంటే, రెండు మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లాయి.
జడ్చర్ల: ఈ నియోజకవర్గంలోని ఊరుకొండ మండలం ఒక్కటే నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండగా, మిగిలినవి మహబూబ్ నగర్ లో ఉన్నాయి.
కల్వకుర్తి: మెజారిటీ మండలాలు రంగారెడ్డి జిల్లాలో చేరగా, కల్వకుర్తి, వెల్దండ మండలాలు మాత్రం నాగర్ కర్నూల్ లోనే ఉండిపోయాయి.
కొల్లాపూర్: మూడు మండలాలు నాగర్ కర్నూల్, రెండు మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లాయి.
తలెత్తుతున్న పరిపాలన చిక్కులు అసెంబ్లీ నియోజకవర్గం ఒకవైపు, జిల్లా కేంద్రం మరొకవైపు ఉండటంతో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఒక చిన్న పని కావాలన్నా పదుల కిలోమీటర్ల దూరంలోని వేరే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. కలెక్టరేట్ ఒకచోట, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరోచోట ఉండటంతో ప్రోటోకాల్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ, సాధ్యమైనంత వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాలను ఒకే జిల్లా కిందికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లాల కుదింపు ఉండదు..
కొత్తవి వస్తాయ్! జిల్లాల పునర్విభజన అంటే జిల్లాల సంఖ్యను తగ్గిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, నిపుణుల విశ్లేషణ ప్రకారం జిల్లాల కుదింపు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిని సవరించడం ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో పాలనా సౌలభ్యం కోసం మరికొన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డివిజన్ల డిమాండ్లను ఈసారి పరిష్కరించే అవకాశం మెండుగా కనిపిస్తోంది.






