- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మోత్సవాలకు రాయలగండి ముస్తాబు
నల్లమల ప్రాంతంలోని రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుంచి 25 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

నల్లమల అటవీ ప్రాంతంలోని రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుంచి 25 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. శనివారం గణపతి పూజతో ప్రారంభమయ్యే ఈ వేడుకల కోసం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసి, యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 22న స్వామివారి కళ్యాణం, 23న ప్రభోత్సవం, పల్నాటి యుద్ధం నాటక ప్రదర్శనతో పాటు జిల్లా స్థాయి వాలీబాల్, కోలాట పోటీలు నిర్వహించనున్నారు. 1536లో నిర్మితమైన ఈ చారిత్రక ఆలయ జాతరకు మంత్రి వివేక్, ఎంపీ మల్లు రవి తదితర ప్రముఖులు హాజరుకానుండగా, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాల సరిహద్దున వెలసిన రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ప్రకృతి రమణీయత మధ్య ఎత్తైన కొండపై వెలసిన ఈ ఆలయ జాతర ఉత్సవాలు ఈనెల 21 నుంచి 25వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకల కోసం దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ విశిష్టత..
క్రీస్తుశకం 1536లో చింతగుండ రంగారావు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తన తండ్రి రంగారావు జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి 'రంగా రాయునిగండి' అని పేరు పెట్టగా, కాలక్రమేణా అది 'రాయలగండి'గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఆది నుంచి మాల దాసరి వర్గానికి చెందిన వారే పూజలు నిర్వహించడం ఒక విశేషం. పాల్గుణ శుద్ధ పంచమి నాడు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై పడతాయని, ఆ సమయంలో దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
అభివృద్ధి పనులకు నిధుల వెల్లువ...
ఆలయ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గత ఏడాది రూ.60 లక్షల నిధులతో సీసీ రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించగా, ఈ ఏడాది కమ్యూనిటీ హాల్ పనుల కోసం మరో రూ.25లక్షలు కేటాయించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి తన సొంత నిధులు రూ.5లక్షలతో ఆలయ అర్చిని నిర్మిస్తున్నారు. అలాగే టీటీడీ ద్వారా ఆంజనేయస్వామి గుడి కోసం రూ.20లక్షల నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు.
ఐదు రోజుల ఉత్సవాల షెడ్యూల్..
- 21న ఉదయం గణపతి పూజ, 108 కలశాలతో అభిషేకం ఉంటుంది. సాయంత్రం అచ్చంపేట రంగాపూర్ కాలనీ నుంచి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు రాయలగండికి చేరుకుంటుంది.
- 22న కళ్యాణం : ఉదయం 10:16 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఎంపీ మల్లు రవి, మంత్రి వివేక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు హాజరవుతారు.
- 23న ప్రభోత్సవం: వివిధ గ్రామాల నుంచి ప్రభలు తరలివస్తాయి. రాత్రి పల్నాటి యుద్ధం నాటక ప్రదర్శన ఉంటుంది.
- 24, 25 తేదీల్లో : స్వామివారికి నాగవల్లి, సాంస్కృతిక కార్యక్రమాలు, ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ముగుస్తాయి.
క్రీడలు, సాంస్కృతిక పోటీలు..
జాతర సందర్భంగా భక్తులను అలరించేందుకు జిల్లాస్థాయి వాలీబాల్, కోలాటం, భజన పోటీలను నిర్వహిస్తున్నారు. వాలీబాల్ విజేతలకు రూ.30వేల వరకు, కోలాట పోటీల విజేతలకు రూ.20వేల వరకు నగదు బహుమతులు అందజేస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తోంది.






