పేదోడి బియ్యం మాఫియా పాలు.. పక్క రాష్ట్రాలకు అక్రమ రవాణా

by Malleboina Mahesh |

నారాయణపేటలో రేషన్ బియ్యం మాఫియా హల్చల్! మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వడంతో అక్రమ రవాణా జోరు. అధికారులు స్పందించాలని డిమాండ్.

పేదోడి బియ్యం మాఫియా పాలు.. పక్క రాష్ట్రాలకు అక్రమ రవాణా
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: పేదవాడి ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం.. అక్రమార్కుల జేబులు నింపుతోంది. నారాయణపేట జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, రాజకీయ అండదండలు తోడవడంతో పేదోడి బువ్వ పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. రబీ సీజన్ ధాన్యం సేకరణ దృష్ట్యా గోదాములను ఖాళీ చేయాలని సాకుతో ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో దళారులకు కాసుల వర్షం కురుస్తోంది. జిల్లాలో మక్తల్, నారాయణపేట, దామరగిద్ద, మరికల్ మండలాల్లో ఐదు రోజులుగా అర్ధరాత్రి వేళల్లో టన్నుల కొద్ది బియ్యం సరిహద్దులు దాటుతున్న సివిల్ సప్లై అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

దందా సాగుతోందిలా..

గ్రామీణ ప్రాంతాల్లో అమాయక లబ్ధిదారుల నుంచి కిలోకు రూ.17 చొప్పున కొనుగోలు చేస్తున్న బ్రోకర్లు, వాటిని జిల్లా కేంద్రంలోని ప్రధాన దళారులకు రూ.20కు విక్రయిస్తున్నారు. అక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా కర్ణాటకలోని గుర్మిట్కల్ వంటి ప్రాంతాలకు తరలించి కిలో రూ.25 నుంచి రూ. 28 వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

చెక్ పోస్టుల్లో తనిఖీలు గాలికి..

అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన తైరోడ్, జిలాల్పూర్, కాన్కుర్తి వంటి కీలక మార్గాల్లో చెక్ పోస్టుల నిర్వహణ నామమాత్రంగానే ఉంది. విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో అక్రమ రవాణా వాహనాల రూట్ మారుతుందే తప్ప ఆగడం లేదని విమర్శలు వస్తున్నాయి. ట్రక్కు షీట్లు మారుస్తూ, నకిలీ వే బిల్లులతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.

రీసైక్లింగ్ మాయాజాలం..

కొందరు డీలర్లు, బ్రోకర్లు రైస్ మిల్లు యజమానులతో చేతులు కలిపి సేకరించిన రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాలిష్ పట్టి మళ్లీ ప్రభుత్వానికే సివిల్ సప్లై కింద అప్పజెబుతూ అటు ప్రభుత్వం నుంచి, ఇటు నల్లబజారు నుంచి రెట్టింపు లాభాలు గడిస్తున్నారు.

దామరగిద్దలో డీలర్ల దౌర్జన్యం..

జిల్లాలోని దామరగిద్ద మండలంలో అక్రమ బియ్యం మాఫియా పరాకాష్టకు చేరింది. ఇక్కడ డీలర్లు గ్రామాల వారీగా సిండికేట్‌గా మారి బియ్యం పంపిణీ చేయకుండానే లబ్ధిదారులకు నేరుగా నగదు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనుకాడటం లేదు. గురువారం రాత్రి ఈ మండలంలో భారీ ఎత్తున బియ్యం తరలిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

పేటలో పాత గంజి అడ్డాగా..

నారాయణపేట పట్టణంలోని పాతగంజి ప్రాంతం దళారులకు ప్రధాన కేంద్రంగా మారింది. రేషన్ షాపుల దగ్గరే బ్రోకర్లు తిష్టవేసి, బియ్యం తీసుకున్న వెంటనే కిలోకు రూ.18 నుంచి 20 ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. సివిల్ సప్లై అధికారుల కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇదంతా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న అధికారులు మామూళ్లకు ఆశపడి మౌనంగా ఉంటే పేదవాడికి దక్కాల్సిన పోషకాహారం పక్కదారి పట్టడం ఖాయమని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story