ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాపాలన : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాపాలన :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా పరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనతో, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు ప్రజల్లో ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలన్న లక్ష్యంతో ఈ 99 రోజుల కార్యక్రమం కొనసాగుతున్నదని, ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించగా, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల వారి భద్రత, స్వావలంబన పెరిగిందని, చిన్నచిన్న వ్యాపారులు చేసుకొనే మహిళలు కూడా ఈ సౌకర్యంతో తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు.


గత 2 సంవత్సరాల 4 నెలల్లో మహిళలకు సుమారు 10 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యిందని, మొత్తం 5 సంవత్సరాల్లో ఇది 25 వేల కోట్లకు చేరుతుందని అంచనాగా చెప్పారు.‌ గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, ప్రతి కుటుంబానికి నెలకు 1000 నుండి 1400 రూపాయల వరకు ఆదా అవుతోందని తెలిపారు.‌ రైతులకు భారీ రుణమాఫీ అమలు చేశామని, మహబూబ్‌నగర్‌లో 11,000 మంది రైతులకు 82 కోట్ల రూపాయల రుణమాఫీ కల్పించినట్లు, రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కోట్లతో 25 లక్షల కుటుంబాలకు రుణ విముక్తి కల్పించినట్లు పేర్కొన్నారు. జూన్ 2 నుండి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు, ఈ పథకం ద్వారా 1.15 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షలు అందించి, వారు స్వయంగా ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు, రేషన్ షాపుల్లో నాణ్యమైన సన్నబియ్యం అందుబాటులో ఉంచినట్లు, విద్య, వైద్యం, ఇల్లు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. 'శతశాతం' కార్యక్రమం ద్వారా సుమారు 40 పాఠశాలలో వాలంటీర్లను నియమించి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, దీని ఫలితంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పదవ తరగతి ఫలితాల్లో 90 శాతం పాస్ రేటు సాధించినట్లు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని, ప్రజల సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్నారు.

ప్రభుత్వ పథకాలు అందేలా చూడడమే ప్రజాపాలన..

ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడటమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. పథకాలు అమలు ఏ విధంగా జరుగుతుందో ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని, వాటిని పేద ప్రజలకు మరింత సమర్థవంతంగా పనిచేయడం ఎంతో కీలకమని ఆమె అన్నారు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకాలని, ప్రజలకు అవగాహన కలిగించి, దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలో వివరించి నిజమైన లబ్ధీదారులకు చేరేలా చూడాలని ఆమె సూచించారు.

రోడ్డు భద్రత పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు..

జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ, 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టు ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. తగు జాగ్రత్తలు తీసుకోకుండా అతి వేగంతో ప్రమాదాలకు గురై వారి విలువైన ప్రాణాలను పోగొట్టుకుని వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతూ, ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయని ఎస్పీ ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా యువత మత్తు పదార్థాల దుర్వ్యవసనాల మీద, నిషేధిత మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, నిల్వ ల మీద గట్టి నిఘా ఉంచి చాలా వరకు నివారించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి వివరించారు.ఈ కార్యక్రమంలో మేయర్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, సుధాకర్ రెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Next Story