భూ సమస్యలకు చెక్.. అత్యాధునిక టెక్నాలజీతో సరిహద్దుల నిర్ణయం

by velandi.Saikiran |

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకముగా చేపట్టిన ‘సమీకృత భూభారతి’ పథకానికి కోస్గి మండలం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది.

భూ సమస్యలకు చెక్.. అత్యాధునిక టెక్నాలజీతో సరిహద్దుల నిర్ణయం
X

భూ సమస్యలకు చెక్..

పైలెట్ ప్రాజెక్టుగా కోస్గి ఎంపిక!

- సమీకృత భూ భారతితో భూముల సమగ్ర సర్వే..

- ధరణి కష్టాలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం

- అత్యాధునిక టెక్నాలజీతో పరిష్కారం.. 'భూధార్' నంబర్ కేటాయింపు

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకముగా చేపట్టిన ‘సమీకృత భూభారతి’ పథకానికి కోస్గి మండలం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. ధరణి లోపాలను సవరించి, పారదర్శకత పెంచేందుకు అత్యాధునిక డిజిటల్ రోవర్ మిషన్లు, శాటిలైట్ టెక్నాలజీ ద్వారా భూములను సర్వే చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక ప్రత్యేక ‘భూధార్’ నంబరును కేటాయించి, భూ సరిహద్దులపై పూర్తి స్పష్టతనిస్తారు. ఏప్రిల్ 2 నుంచి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కానుండగా, దీనివల్ల భూ వివాదాలకు చెక్ పడడమే కాకుండా ప్రభుత్వ భూముల రక్షణ కూడా సులభతరం కానుంది. దశాబ్దాలుగా వేధిస్తున్న పొజిషన్, సర్వే నంబర్ల గందరగోళం తొలగిపోయి, రైతులు తమ భూములపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు పొందే అవకాశం లభిస్తుంది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : గత కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గతంలో ‘ధరణి’ పోర్టల్ వల్ల భూ యజమానులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కాంగ్రెస్ ప్రభుత్వం ‘సమీకృత భూభారతి’ అనే సరికొత్త ప్రక్రియను చేపట్టింది. ఈ పథకాన్ని మొదటి విడతగా రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోస్గి మండలం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. ఈ మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను ఆధునిక సాంకేతికతతో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పకడ్బందీగా భూముల వివరాల సేకరణ...

సర్వే నిర్వహించే గ్రామాల్లో ముందుగా గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, కాలువలు, అటవీ భూములతోపాటు పట్టా భూములకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తారు. అనంతరం సంబంధిత భూ యజమానులందరికీ సర్వేకు సంబంధించిన నోటీసులు పంపుతారు. నోటీసులు అందిన తర్వాత వివిధ విభాగాల నుంచి వచ్చే అభ్యంతరాలను సేకరించి, వాటిని పరిష్కరించిన తర్వాతే అసలు సర్వే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఒక సర్వే నంబరును ప్రాతిపదికగా తీసుకుని, అందులో మొత్తం ఎంత భూమి ఉంది, అది ప్రస్తుతం ఎవరెవరి పేర్ల మీద ఉందనే వివరాలను బై నంబర్లతో సహా సేకరిస్తారు.

అత్యాధునిక టెక్నాలజీతో సరిహద్దుల నిర్ణయం..

భూముల సరిహద్దులను పక్కాగా నిర్ణయించేందుకు ‘డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్’ (డీజీపీఎస్) రోవర్ మిషన్లను ఉపయోగిస్తారు. దీని ద్వారా ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లను (ఎల్‌పీఎం) రూపొందిస్తారు. ఒకే సర్వే నంబర్ లో ఉన్న గందరగోళ బై నంబర్లను తొలగించి, ప్రతి భూ యజమానికి ఆధార్ కార్డు తరహాలోనే ఒక ప్రత్యేక ‘భూధార్’ నంబరును కేటాయిస్తారు. దీనివల్ల ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన గుర్తింపు లభిస్తుంది.

రైతులకు బహుళ ప్రయోజనాలు...

సమీకృత భూభారతి ద్వారా తరతరాలుగా వస్తున్న భూ వివాదాలకు తెరపడనుంది. క్షేత్రస్థాయిలో పొజిషన్ ఒకచోట, రికార్డుల్లో సర్వే నంబర్లు మరోచోట ఉండడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల వల్ల గ్రామాల్లో జరిగే గొడవలు ఆగిపోవడమే కాకుండా, భూమిని అమ్ముకోవాలన్నా లేదా ఇతర అవసరాలకు వినియోగించుకోవాలన్నా పక్క వారితో ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల ఆక్రమణలను సులభంగా గుర్తించవచ్చు. భూధార్ కార్డు ఉండడం వల్ల రైతు తన పొలాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా విక్రయించుకునే అవకాశం కలుగుతుంది.

ఏప్రిల్ 2 నుంచి క్షేత్రస్థాయి సర్వే పనులు..

కోస్గి మండలంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామాల వారీగా భూముల కొలతలు ప్రారంభం కానున్నాయి. ఈ సర్వేలో అత్యాధునిక పరికరాలతోపాటు శాటిలైట్ టెక్నాలజీని కూడా వినియోగిస్తారు. దీనికి సంబంధించి రాబోయే రెండు మూడు రోజుల్లో సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నారు. నారాయణపేట జిల్లా ఆర్డీఓ రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. సమీకృత భూభారతి పోర్టల్ కోసం కోస్గి ఎంపికైందని, ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే పూర్తిస్థాయి విధివిధానాల ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్వే పనులు చేపడతామని తెలిపారు.

Next Story