మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్యం : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

by Ratna Kumari |

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్యం :  మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
X

దిశ, కొల్లాపూర్ : కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం కొల్లాపూర్ ప‌ట్ట‌ణంలోని సుర‌భి రాజా కోట ప్రాంగ‌ణంలో నిర్వ‌హించిన స‌భ‌లో క‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్ తో క‌లిసి మెప్మా ప‌రిధిలోని స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు మంజూరు చేసిన వ‌డ్డీలేని రుణాల‌ను మంత్రి పంపిణీ చేశారు. ప‌ట్ట‌ణ ప‌రిధిలోని 153 స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాల‌కు రూ.47.15 ల‌క్ష‌ల విలువైన జంబో చెక్ ను అంద‌జేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన పెంపొందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల సంక్షేమానికి తొలి సంతకంగా మహాలక్ష్మి పథకం అమలు చేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి గుర్తు చేశారు.

మహిళాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత‌ ఇస్తోందని, గ్రామాలు, పట్టణాల్లో మహిళలు దుబారా ఖర్చులను తగ్గించుకొని పొదుపు, పెట్టుబడుల వైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి విద్యాాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో అన్నిరకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను మహిళల పేరుపై అమలు చేస్తోందని మంత్రి జూపల్లి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, మహాలక్ష్మి పథకం, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, అద్దె బస్సులు వంటి పథకాలు మహిళల ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతున్నాయని చెప్పారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, సమావేశాలు, వ్యాపార ప్రోత్సాహం కోసం ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం త్వరలో పూర్తికానుందని మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అందిస్తున్న వడ్డీ లేని రుణాలతో మహిళలు కిరాణా దుకాణాలు, పాడి పరిశ్రమ, పశుపోషణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, హస్తకళలు, కుటీర పరిశ్రమల్లో ముందడుగు వేస్తూ అప్పుల భారంలేకుండా ఆర్థికంగా ఎదుగుతున్నారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, మెప్మా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, క‌వి యాకుబ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా మండలి స‌భ్యులు ప‌ల్లె న‌ర్సింహా పాల్గొన్నారు.

Next Story