ప్రజల న్యాయస్థానం 'లోక్ అదాలత్'

by Nallavelli.Anjaneyulu |

లోక్ అదాలత్ అనేది ప్రజల న్యాయస్థానం అని, ఇరువర్గాల కక్షీదారులు సామరస్యంతో రాజీ కుదుర్చుకునే ఒక వేదిక అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ పి.సామ్ కోషి అన్నారు.

ప్రజల న్యాయస్థానం లోక్ అదాలత్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : లోక్ అదాలత్ అనేది ప్రజల న్యాయస్థానం అని, ఇరువర్గాల కక్షీదారులు సామరస్యంతో రాజీ కుదుర్చుకునే ఒక వేదిక అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ పి.సామ్ కోషి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో, హైకోర్టు న్యాయమూర్తి ఎన్వీ శ్రావణ్ కుమార్ తో కలిసి ఆయన జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించి ప్రసంగించారు. న్యాయస్థానం లో పెండింగ్ లో ఉన్న లేదా వ్యాజ్యానికి ముందు దశలో స్నేహపూర్వక పద్ధతిలో రాజీ కుదుర్చుకునే పరిష్కరించే ఒక వేదిక అని, ఈ వేదిక పై రాజీ చేసుకని పరిష్కరించుకుంటే జడ్జిమెంట్ తో సమానమైనదని, మళ్ళీ అప్పీలు ఉండదని ఆయన అన్నారు.

గతంలో సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నిర్వహించే లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అవుతున్నందున ప్రజలు ఈ అదాలత్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ వ్యవస్థ భారతదేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల్లో అత్యంత సమర్థవంతమైనదిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మోటారు ప్రమాద క్లెయిమ్స్, సివిల్, బ్యాంకు రుణాలు, చెక్కు బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాల వంటి అనేక కేసులను లోక్ అదాలత్ ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తి అన్నారు.

లోక్ అదాలత్ బలమైన ఒక న్యాయ వ్యవస్థ : హైకోర్టు న్యాయ‌మూర్తి శ్రావ‌ణ్ కుమార్

లోక్ అదాలత్ ఒక బలమైన న్యాయ వ్యవస్థ అని, తక్కువ ఖర్చుతో కూడిన న్యాయం అందించడమే లక్ష్యంగా చేసుకున్నదని హైకోర్టు న్యాయమూర్తి ఎన్వీ శ్రావణ్ కుమార్ అన్నారు. చిన్న కేసులను పరిష్కరించడానికి కూడా న్యాయస్థానాలకు సంవత్సరాల సమయం పడుతుందని, అందువల్ల వేగవంతమైన, చవకైన న్యాయం కోసం ఒక ప్రత్యామ్నాయ పరిష్కారమైన మార్గాన్ని లోక్ అదాలత్ అందిస్తుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయం అందుబాటులోకి తీసుకురావడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని, వారికి న్యాయ అవగాహన శిబిరాలు నిర్వహించి, ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు కృషి చేయాలని న్యాయమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ లోక్ అదాలత్ కేసుల పరిష్కారానికి మహబూబ్ నగర్ కోర్టులో 5, జడ్చర్ల కోర్టులో 2 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఇందిర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, కక్షీదారులు పాల్గొన్నారు.

Next Story