మున్సిపల్ ఎన్నికల్లో శాంతియుత వాతావరణమే లక్ష్యం : ఎస్పీ జానకి

by Ratna Kumari |

మహబూబ్‌ నగర్ పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఎస్పీ డి.జానకి బుధవారం పరిశీలించారు.

మున్సిపల్ ఎన్నికల్లో శాంతియుత వాతావరణమే లక్ష్యం :  ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్‌ నగర్ పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఎస్పీ డి.జానకి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు చర్యలను ఆమె పరిశీలించి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో, న్యాయ సమ్మతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. నామినేషన్ కేంద్రాలన్నీ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల నిఘా లో ఉన్నాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉందని, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల పరిధిలో గుంపులుగా చేరవద్దని ప్రజలను కోరారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో బారికేడింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో రెండు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లకూడదని, ఎన్నికల సమయంలో ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తుగా 5 లక్షల రూపాయల వరకు బైండోవర్ చర్యలు చేపడుతున్నామని, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే పూచీకత్తు మొత్తాన్ని జరిమానా గా వసూలు చేస్తామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించి, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని ఆమె కోరారు. ఎస్పీ వెంట వన్ టౌన్ సీఐ అప్పయ్య పాల్గొన్నారు.

Next Story