- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పచ్చదనం పడకేసిన పాలమూరు పార్కులు
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడి సంవత్సరం కాలం దాటినా పట్టణంలోని పలు పార్కుల్లో శుచి, శుభ్రత, నిర్వాహణా లోపంతో 'పడావ్ పడి' అధ్వాన్న స్థితిలో ఉన్నవి.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడి సంవత్సరం కాలం దాటినా పట్టణంలోని పలు పార్కుల్లో శుచి, శుభ్రత, నిర్వాహణా లోపంతో 'పడావ్ పడి' అధ్వాన్న స్థితిలో ఉన్నవి. ముఖ్యంగా స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ లో రెండు, శ్రీనివాస కాలనీలో రెండు, టీచర్స్ కాలనీలో మూడు, బాయమ్మతోట లో ఒకటి ఇలా పట్టణంలోని పార్కులన్నింటిలో పచ్చదనం పడకేసింది. శ్రీనివాస కాలనీ రూరల్ పోలీస్ స్టేషన్ వెనక ఆనుకొని ఉన్న 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద పార్కు పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. గత ప్రభుత్వ హయాంలో కోటి 50 లక్షల రూపాయలతో పెద్ద పార్కును వివిధ రకాల పూల మొక్కలు, పిల్లలు ఆడుకునే క్రీడా పరికరాలు, రెండు విభాగాల్లో జిమ్ లు, అనేక డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసి 2021 లో ప్రారంభించారు. అప్పటి నుంచి నేటివరకు పార్కు ఆలనా పాలనా చూసుకునే నాథుడే లేడు. పార్కు నిండా తాగి పడేసిన మద్యం సీసాలు, వాడి పడేసిన నీళ్ల బాటిళ్లలతో నిండిపోయింది.
వాకర్స్ నడిచే 'వాక్సింగ్ ట్రాక్' గుంతలు, ఎత్తులతో ఉంది, వర్షం వస్తే కుంట ను తలపిస్తుంది. పగిలిపోయిన డస్ట్ బిన్ లు, తిని పడేసిన ఇస్తరాకులతో చెత్తాచెదారం నిండిపోయింది. ఆరోగ్యంగా ఉండేందుకు రెండు విభాగాల్లో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలన్నీ విరిగి పడిపోయి సంవత్సర కాలం దాటిపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు స్కూళ్లు, కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు విద్యాసంస్థలకు ఎగ్గొట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ద్విచక్ర వాహనాలు పార్కుల్లో కి ప్రవేశించి పొగతో కాలుష్యాన్ని వదులుతుంటారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఒత్తిడి నుండి ఉపశమనానికి పార్కు లకు వెళ్ళాలంటే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం-స్వచ్ఛదనం కార్యక్రమం చేపట్టి పార్కులను శుభ్రపరిచి, నిర్వాహణా బాధ్యతలను నిర్వాహకులకు అప్పగించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.






